NHAI Recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 11 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. NHAIలో సీనియర్ బ్రిడ్జి లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్, డొమెయిన్ స్పెషలిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కావల్సిన విద్యార్హతలను కలిగి ఉండాలి. అలాగే పోస్టును బట్టి గరిష్ట వయో పరిమితి ఉంటుంది. సీనియర్ బ్రిడ్జి లేదా స్ట్రక్చరల్ లేదా సీనియర్ టన్నెల్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 60 ఏళ్ల వరకు ఉండవచ్చు. అలాగే బ్రిడ్జి డిజైన్, జియో టెక్నికల్, హైడ్రాలజీ అండ్ హైడ్రాలిక్ స్పెషలిస్ట్, టన్నెల్ ఇంజినీర్, జియాలజిస్ట్ పోస్టుకు గరిష్ట వయస్సును 55 ఏళ్లుగా నిర్ణయించారు.

గరిష్ట వేతనం రూ.5 లక్షలు..
క్వాంటిటీ సర్వేయర్ లేదా డ్రాఫ్ట్స్‌మన్ పోస్టుకు గరిష్ట వయస్సును 45 ఏళ్లుగా విధించారు. సీనియర్ బ్రిడ్జి లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్‌కు గరిష్టంగా రూ.5లక్షల వేతనాన్ని ఇస్తారు. అలాగే బ్రిడ్జి డిజైన్ ఇంజినీర్, జియో టెక్నికల్ ఇంజినీర్, హైడ్రాలజీ అండ్ హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్, టన్నెల్ ఇంజినీర్, జియాలజిస్ట్ పోస్టులకు గరిష్టంగా రూ.3.50 లక్షలను ఇస్తారు. సీనియర్ టన్నెల్ ఇంజినీర్ పోస్టుకు రూ.5 లక్షలు, క్వాంటిటీ సర్వేయర్ పోస్టుకు రూ.1.50 లక్షలు, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టుకు రూ.75వేలు ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు గాను అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు. కేవలం మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 30ని చివరి తేదీగా నిర్ణయించారు. కాగా సీనియర్ బ్రిడ్జి, స్ట్రక్చరల్ ఇంజినీర్, డొమెయిన్ ఎక్స్‌పర్ట్స్ విభాగంలో 1 పోస్టు, బ్రిడ్జి డిజైన్ ఇంజినీర్ విభాగంలో 2, జియో టెక్నికల్ ఇంజినీర్ విభాగంలో 1, హైడ్రాలజీ అండ్ హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్ సెక్షన్‌లో 1, సీనియర్ టన్నెల్ ఇంజినీర్ విభాగంలో 1, టన్నెల్ ఇంజినీర్ విభాగంలో 1, జియాలజిస్ట్ విభాగంలో 1, క్వాంటిటీ సర్వేయర్ విభాగంలో 1, డ్రాఫ్ట్స్‌మన్ విభాగంలో 2 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. ఇక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in/index.html ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.