SBI Whatsapp Banking Service : దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు అనేక విధాలుగా సేవలను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించింది. దీంతో బ్యాంకు కస్టమర్లు మరింత సులభంగా సేవలను పొందవచ్చు. దీని ద్వారా తమ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చిటికెలో తెలుసుకోవచ్చు. అలాగే ఎస్‌బీఐకి చెందిన పలు ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది జనాల్లో బాగా పాపులర్ అయింది. మన దేశంలోనే కాదు దాదాపుగా ప్రతి దేశంలోనూ చాలా మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. ఇక అనేక వ్యాపార సంస్థలతోపాటు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు, మరింత సులభంగా సేవలను అందించేందుకు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నాయి. అందులో భాగంగానే ఎస్‌బీఐ కూడా తన కస్టమర్లకు మరింత సులభంగా బ్యాంకింగ్ సేవలను అందించేందుకు వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది.
ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి..
అయితే ఎస్‌బీఐ అందిస్తున్న వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందాలంటే ముందుగా కస్టమర్లు ఈ సేవల కోసం బ్యాంకు మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఫోన్ నంబర్ ఉన్న మొబైల్‌లో ఎస్‌బీఐకి చెందిన వాట్సాప్ బ్యాంకింగ్ ఫోన్ నంబర్ +919022690226 ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌ను ఓపెన్ చేసి అందులో సింపుల్‌గా Hi అని టైప్ చేసి ముందు ఇచ్చిన నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. దీంతో మీ ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం అవుతాయి.
ఇక ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు అనేక సేవలను పొందవచ్చు. ఈ సర్వీస్ సహాయంతో కస్టమర్లు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని సెకన్లలోనే తెలుసుకోవచ్చు. అలాగే మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ సమాచారం, ఎన్ఆర్ఐ సర్వీస్ వంటి సేవలను ఎస్‌బీఐ కస్టమర్లు ఈ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా పొందవచ్చు. ఇలా ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.