Sukanya Samriddhi Yojana : ప్రస్తుత తరుణంలో చాలా మంది డబ్బును పొదుపు చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు స్టాక్ మార్కెట్లలో, ఇంకొందరు మ్యుచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో తమ డబ్బును ఉంచుతారు. కానీ తల్లిదండ్రులు తమ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డబ్బును పొదుపు చేస్తే దాంతో డబ్బుకు సెక్యూరిటీ ఉండడమే కాదు, ఆమెకు 21 ఏళ్లు వచ్చే సరికి పెద్ద ఎత్తున డబ్బును పొందవచ్చు. దీంతో ఆ డబ్బు ఆమె ఉన్నత చదువులకు, పెళ్లికి ఉపయోగపడుతుంది. ఇక ఆ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ల కిందటే సుకన్య సమృద్ధి యోజన పేరిట ఓ స్కీమ్‌ను ప్రారంభించింది. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఏడాదికి ఒకసారి కనీసం రూ.250 పొదుపు చేస్తే చాలు. గరిష్టంగా ఏడాదికి ఇందులో రూ.1.50 లక్షలను పొదుపు చేయవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా 8.2 శాతం వడ్డీని ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే ఇది ఎప్పటికప్పుడు మారుతుంది. ఇక ఆడపిల్లకు 10 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్సు ఉంటే ఆమె పేరిట ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ స్కీమ్‌లో డబ్బును పొదుపు చేయవచ్చు. దీన్ని సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
15 ఏళ్ల పాటు డబ్బును జమ చేయాలి..
ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 5 లోపు డబ్బు జమ చేస్తే దాంతో గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మొత్తం 15 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. మీకు అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఉంటే ఆమె పేరిట డబ్బును పొదుపు చేస్తే 15 ఏళ్ల పాటు కడితే చాలు.. తరువాత ఆమెకు 21 ఏళ్లు వచ్చే సరికి స్కీమ్ మెచూరిటీ పూర్తి అవుతుంది. దీంతో డబ్బు చేతికి అందుతుంది. ఇలా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. ఇక ఇందులో రూ.71 లక్షలు ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా తల్లిదండ్రులు తమ కుమార్తె పేరిట ఏటా రూ.1.50 లక్షలను పొదుపు చేయాలి. దీంతో వారు 15 ఏళ్ల పాటు పొదుపు చేసే మొత్తం రూ.22.50 లక్షలు అవుతుంది. దీనికి రూ.49,32,119 వడ్డీ లభిస్తుంది. దీంతో మొత్తం కలిపి రూ.71,82,119 వస్తాయి. ఇలా మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండే సరికి ఆమె కోసం రూ.71 లక్షలను ఇలా పొందవచ్చు. దీంతో మీ కుమార్తెకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇలా వచ్చే మొత్తంపై ఎలాంటి పన్ను విధించబడదు. దీనికి గాను పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కనుక ఇదొక గొప్ప స్కీమ్ అని చెప్పవచ్చు.