SSC GD 2024 : నిరుద్యోగులకు, యువతకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను నోటిఫికేషన్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD) పోస్టుల భర్తీకి గాను సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తోంది. SSC వార్షిక క్యాలెండర్ 2024 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అక్టోబర్ 5వ తేదీన ముగిస్తారు. ఇక వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలను నిర్వహిస్తారు.
గతేడాది 46,617 పోస్టులను భర్తీ చేయగా, ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ పోస్టులకు కేవలం టెన్త్ పాస్ అయితే చాలు. పురుషులు అయితే ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి. స్త్రీలు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెల వేతనం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది.
విభాగాల వారిగా అభ్యర్థుల ఎంపిక..
బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎస్ఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు గాను అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ స్టేటస్‌ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://ssc.nic.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.