Mahila Samman Saving Certificate Scheme : దేశంలో ఉన్న పౌరులు తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. అవన్నీ పౌరులకు మంచి రిటర్న్స్‌ను అందించడమే కాదు, వారు పెట్టే డబ్బుకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అందుకని చాలా మంది పలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో తమ డబ్బును పొదుపు చేస్తున్నారు. ఇక పిల్లలు, మహిళలు, వృద్ధులకు కూడా ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్‌లో ఈ తరహా పథకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. పోస్టాఫీస్ పథకాలు అంటే అవి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడేవే. కనుక పౌరులు తమ డబ్బును నిర్భయంగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడిగా పెట్టవచ్చు.
ఇక పోస్టాఫీస్‌లో మహిళలకు అందుబాటులో అనేక పథకాలు ఉన్నాయి. వాటిల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ పథకం మెచూరిటీ కేవలం 2 ఏళ్లు మాత్రమే కావడం విశేషం. పైగా డబ్బుకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇక ఇందులో భాగంగా మహిళలు కనీసం రూ.1000తో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. అయితే ఈ పథకం కింద ఒక మహిళ ఎన్ని ఖాతాలను అయినా సరే ఓపెన్ చేసి వాటిల్లో డబ్బును పొదుపు చేయవచ్చు. అయితే ఒక అకౌంట్ తెరిచాక మళ్లీ ఇంకో అకౌంట్ తెరిచేందుకు కనీసం 3 నెలలు ఆగాల్సి ఉంటుంది.
గరిష్టంగా రూ.2 లక్షలు పొదుపు చేయవచ్చు..
ఇక ఒక్కో అకౌంట్‌లో కనీసం రూ.1000 పొదుపు చేయవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఒక మహిళ ఇలా ఎన్ని అకౌంట్లలో అయినా సరే డబ్బులను పొదుపు చేయవచ్చు. ఈ పథకంలో భాగంగా 7.5 శాతం వడ్డీని ప్రస్తుతం చెల్లిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఈ పథకంపై ఇచ్చే వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక ఈ పథకంలో చేరాలనుకునే మహిళలు ముందుగా వడ్డీ రేట్లను గురించి అడిగి తెలుసుకోవడం మంచిది. దీంతో ఎక్కువ వడ్డీ వచ్చేలా చేసుకోవచ్చు.
ఇక మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ను పోస్టాఫీస్‌లోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద పొదుపు చేసే డబ్బులకు గాను పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అలాగే నెలవారీ ఇన్‌కమ్, గ్యారంటీడ్ రిటర్న్స్ కూడా ఉంటాయి. ఈ పథకంలో పొదుపు చేసే డబ్బును రూ.100 రౌండ్ ఫిగర్‌లో పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో పెట్టే డబ్బుకు గాను 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి అకౌం్‌లో జమ చేస్తారు. అలాగే 2 పతకం మెచూరిటీ కేవలం 2 ఏళ్లు మాత్రమే. 2 ఏళ్ల తరువాత డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అందువల్ల మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది.
ఏడాది తరువాత 40 శాతం తీసుకోవచ్చు..
అయితే ఇందులో డబ్బు పొదుపు చేస్తే ఏడాది తరువాత మొత్తం పొదుపు చేసిన డబ్బులో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇలా కేవలం ఒక్కసారి మాత్రమే చేయవచ్చు. అలాగే ఈ పథకంలో డబ్బు పొదుపు చేసిన మహిళ దురదృష్టవశాత్తూ చనిపోతే నామినీకి లేదా కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేస్తారు. అలాగే తీవ్రమైన రోగాల బారిన పడినా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా డబ్బు మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో భాగంగా ఒకసారి అకౌంట్‌ను ఓపెన్ చేసిన తరువాత కనీసం అందులో 6 నెలల పాటు అయినా డబ్బును ఉంచాలి. ఆ తరువాతే దాన్ని క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. 6 నెలలు అయ్యాక వెంటనే అకౌంట్‌ను క్లోజ్ చేస్తే 2 శాతం తక్కువ వడ్డీ చెల్లిస్తారు.
ఈ పథకంలో భాగంగా గరిష్టంగా రూ.2 లక్షలను పొదుపు చేయవచ్చు. దీనికి 7.50 శాతం వడ్డీ ఇస్తారు. అందువల్ల 2 ఏళ్ల కాల పరిమితికి గాను మొత్తం రూ.32,044 వడ్డీ వస్తుంది. దీంతో 2 ఏళ్ల అనంతరం మహిళ వద్ద రూ.2,32,044 ఉంటాయి. ఈ విధంగా 2 ఏళ్లలోనే ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందవచ్చు.