బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు అందించే సర్వీస్‌లకు గాను ఎప్పటికప్పుడు రూల్స్‌ను మారుస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1, 2024 నుంచి పలు క్రెడిట్ కార్డులకు చెందిన బ్యాంకులు తమ రూల్స్‌ను మార్చాయి. అలాగే రూపే క్రెడిట్ కార్డు రూల్స్ కూడా మారాయి. కనుక మారిన రూల్స్‌ను క్రెడిట్ కార్డు వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో తమకు ఏయే కార్డుల ద్వారా, ఎలాంటి ట్రాన్సాక్షన్ల ద్వారా ఎక్కువ మేలు జరుగుతుంది.. అన్న విషయం తెలుస్తుంది. దీంతో క్రెడిట్ కార్డులను వాడడం ద్వారా నష్టపోకుండా ఉంటారు. ఇక మారిన ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు రూపే క్రెడిట్ కార్డులను గనుక వాడుతున్నట్లయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 1, 2024 నుంచి మీరు రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ విధానంతో కనుక పేమెంట్స్ చేస్తే ఆ చెల్లింపులకు గాను రివార్డు పాయింట్లను పొందవచ్చు. రూపే కార్డుల వినియోగం పెంచేందుకు గాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రూపే క్రెడిట్ కార్డులను వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుందని ఎన్పీసీఐ భావిస్తోంది.
హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుల్లో..
ఇక సెప్టెంబర్ 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తమ క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు కీలకమార్పులు చేసింది. ముఖ్యంగా ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లు నెల మొత్తం మీద ఎంత పెద్దున ట్రాన్సాక్షన్లు చేసినా సరే గరిష్టంగా 2000 రివార్డు పాయింట్లను మాత్రమే పొందగలరు. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ అయిన క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి వాటి ద్వారా స్కూల్ ఫీజును చెల్లిస్తే అలాంటి ట్రాన్సాక్షన్లకు రివార్డు పాయింట్లు లభించవు. కానీ స్కూల్లో ఉండే పీవోఎస్ మెషిన్లో కార్డును స్వైప్ చేసినా లేదా స్కూల్ వెబ్సైట్లో స్కూల్ ఫీజు చెల్లించినా అలాంటి ట్రాన్సాక్షన్లకు రివార్డు పాయింట్లను ఇస్తారు.
ఇక ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1, 2024 నుంచి క్రెడిట్ కార్డుల వినియోగంలో పలు మార్పులు చేసింది. ఈ బ్యాంకులకు చెందిన కస్టమర్లకు క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయ్యాక బిల్లు కట్టేందుకు ఇంతకు ముందు 18 రోజుల వరకు సమయం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దాన్ని 3 రోజులు కుదించారు. అంటే ఈ కార్డు హోల్డర్స్ బిల్ జనరేట్ అయ్యాక 15 రోజుల లోపు ఇకపై పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నెల నెలా మినిమం డ్యూ మొత్తం ఔట్ స్టాండింగ్ మీద 5 శాతంగా ఉండేది. ఇప్పుడు దాన్ని 2 శాతానికి తగ్గించారు. అంటే మొత్తం ఔట్ స్టాండింగ్ పేమెంట్ మీద 2 శాతం మినిమం పేమెంట్ చేస్తే చాలన్నమాట. ఇలా ఆయా బ్యాంకులు క్రెడిట్ కార్డుల వినియోగంలో పలు మార్పులను తీసుకువచ్చాయి. కనుక కస్టమర్లు వీటిని గమనించాలని బ్యాంకులు సూచించాయి.