భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా పేరుగాంచింది. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలోనే రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం సంస్థ వారు ఎప్పటికప్పుడు పలు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే గతంలో రైల్వేలో ఏదైనా ఫిర్యాదు ఉంటే వివిధ రకాల నంబర్లకు ఫోన్ చేయాల్సి వచ్చేది. కానీ రైల్వే శాఖ తాజాగా అన్ని ఫిర్యాదులకు కేవలం ఒకే నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇతర హెల్ప్ లైన్ నంబర్లు అన్నింటినీ విలీనం చేసింది. దీంతో కేవలం ఒకే నంబర్‌ను ప్రయాణికులు డయల్ చేయవచ్చు. దీంతో వారికి ఉండే ఎలాంటి సమస్యను అయినా సరే పరిష్కరించుకోవచ్చు.
ఇక రైల్వే ప్రయాణికులు గతంలో మాదిరిగా కాకుండా ఏ ఫిర్యాదు ఉన్నా సరే 139 అనే నంబర్‌కు కాల్ చేయవచ్చు. దీంతో అన్ని ఫిర్యాదులను ఇందులోనే స్వీకరిస్తారు. ఈ క్రమంలో గతంలో వాడిన ఇతర హెల్ప్ లైన్ నంబర్లను ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన పనిలేదు. ఇక 139 నంబర్‌కు కనుక కాల్ చేస్తే ప్రయాణికులకు సమాచారం అంతా లభిస్తుంది. ఆ విధంగా ఆ నంబర్ వ్యవస్థను తీర్చిదిద్దారు.
ఏ ఫిర్యాదు అయినా సరే..
139 నంబర్‌కు కాల్ చేయడం వల్ల ప్రయాణికులు అనేక సదుపాయాలు పొందవచ్చు. అలాగే వివిధ రకాల ఫిర్యాదులను కూడా అందులోనే నమోదు చేయవచ్చు. రైళ్ల రాకపోకల వివరాలు, టిక్కెట్ల బుకింగ్, టిక్కెట్లను క్యాన్సిల్ చేసే సదుపాయం, ప్రయాణ సమయంలో భద్రత, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వైద్య సహాయం.. ఇలా అన్ని సమస్యలకు, సౌకర్యాలకు ఈ నంబర్ పనిచేస్తుందని రైల్వే శాఖ తెలియజేసింది. కనుక ఇకపై ప్రయాణికులు ఏ ఫిర్యాదు ఉన్నా సరే 139 నంబర్‌కు కాల్ చేయవచ్చు. దీంతో సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరిస్తారు.