Jobs In Israel For 10th Pass Candidates : మన దేశంలో సాధారణంగా నెలకు రూ.2 లక్షలు జీతం సంపాదించాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలోనే లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలో అయితే చాలా ఉన్నత స్థాయి ఉద్యోగంలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఓపిక ఉంటే ఆ దేశానికి వెళ్లవచ్చు. మీరు కేవలం టెన్త్ చదివితే చాలు, ఏకంగా నెలకు రూ.2 లక్షల వరకు జీతం పొందవచ్చు. అలాగే ఉచితంగా ఫుడ్ పెడతారు, రూ.16వేల వరకు బోనస్ కూడా ఇస్తారు. మరి ఇంతకీ ఆ దేశం ఏమిటి.. అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈమధ్యే భారత్‌ను సంప్రదించింది. అక్కడ భవన నిర్మాణ కార్మికులతోపాటు కేర్ గివర్స్‌కు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిందట. దీంతో వారికి ఎంతంటే అంత జీతం ఇచ్చి మరీ పని చేయించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. అందుకోసమే ఆ ప్రభుత్వం మన దేశాన్ని సంప్రదించింది. దీంతో భారతీయులకు అక్కడ భారీ ఉద్యోగాలు లభించనున్నాయి. మొత్తం 15వేల మందిని ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో నియమించుకోనుంది.
ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా..
ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ రంగాల్లో స్కిల్ గ్యాప్‌ను భర్తీ చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఇజ్రాయెల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడింది. దీంతో ఆ ప్రభుత్వం మరోమారు భారత్‌ను సంప్రదించింది. ఇరు దేశాలు కూడా ద్వైపాక్షిక ఉద్యోగాల ఒప్పందం కింద భారతీయులకు అక్కడ పని కల్పించేందుకు రెడీ అయ్యారు.
కాగా మొత్తం 10వేల మంది భవన నిర్మాణ కార్మికులను, మరో 5వేల మంది కేర్ గివర్స్‌ను.. అంతా కలిపి15 వేల మందికి ఇందులో భాగంగా అక్కడ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అయితే ప్రతి రాష్ట్రంలోనూ ఒక చోట జాబ్ మేళా నిర్వహించి ఇందుకు గాను కార్మికులను, కేర్ గివర్స్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఇజ్రాయెల్‌కు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి పనిచేయాలనుకునే వారు ఇజ్రాయెల్‌కు సురక్షితంగా వెళ్లి చేయవచ్చు.
నెలకు వేతనం ఎంతంటే..?
ఈ ఉద్యోగాలకు విద్యార్హత కేవలం టెన్త్ చదివి ఉంటే చాలు. నెలకు రూ.1.92 లక్షల వరకు వేతనం ఇస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్, ఫుడ్, వసతి ఉచితంగా కల్పిస్తారు. అలాగే పని నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ.16వేల బోనస్ ఇస్తారు. అయితే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఈ మేళాను నిర్వహిస్తారు.. అనే వివరాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వెల్లడించనుంది. కనుక అభ్యర్థులు అప్పటి వరకు వేచి చూడక తప్పదు. ఈ విషయంపై అప్ డేట్స్ కావాలంటే అభ్యర్థులు ఎప్పటికప్పుడు వార్తలను యాక్టివ్‌గా తెలుసుకుంటూ ఉండాలి. దీంతో ఉద్యోగం చేసే అవకాశాన్ని మిస్ అవకుండా అందుకోవచ్చు.