తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఆటోలకు చార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది పొదుపు సంఘాలకు చెందిన మహిళలు ఉన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో అప్పట్లో డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. ఈ సంఘాలకు ఎప్పటికప్పుడు పావలా వడ్డీకే రుణాలను అందిస్తూ వస్తున్నారు. ఒకసారి తీసుకున్న రుణాన్ని పొదుపు సభ్యులు అందరూ నిర్ణీత కాలంలోగా చెల్లిస్తే తరువాత మళ్లీ ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవచ్చు. ఇలా చాలా మంది మహిళలు సౌకర్యాన్ని పొందుతున్నారు.
సాధారణంగా డ్వాక్రా లేదా పొదుపు సంఘాలకు చెందిన మహిళలు ఒక గ్రూప్‌లో దాదాపుగా 10 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది లోన్లను తీసుకుని లబ్ధి పొందుతున్నారు. మహిళలు స్వయంగా స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో ఈ పొదుపు సంఘాలను ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఆటోలను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చూడాలి.