తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, యువతకు మరో తీపి కబురు చెప్పింది. 1284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు ఉండగా, వైద్య విధాన పరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో 13 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు 18 నుంచి 46 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తరువాత నవంబర్ 10న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్ మొత్తం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రెండు, మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తాజాగా నోటిఫికేషన్..
కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో భాగంగానే ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. వైద్యశాఖలో పలు హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న మొత్తం 1284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి గాను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
మొత్తం 1284 పోస్టుల్లో 1088 ప్రజారోగ్య సంచాలకు విభాగంలో ఖాళీగా ఉన్నాయి. మరో 183 తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్నాయి. మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్నాయి. జోన్‌ల వారిగా చూస్తే జోన్ 1లో 218, జోన్ 2లో 135, మూడులో 173, నాలుగులో 191, ఐదులో 149, ఆరులో 220, 7వ జోన్‌లో 185 పోస్టులు ఉన్నాయి.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు మార్కుల్లో వెయిటేజీ..
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కల్పించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నట్లు ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్ బోర్డులో తమ విద్యార్హత పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. పోస్టుల్లో 95 శాతం స్థానికులకు కేటాయించారు. 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులుగా పరిగణించబడతారు. ఒకవేళ 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకపోతే స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.