దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (గ్రాడ్యేయేషన్) లలో చీఫ్ కమర్షియల్ కమ్ టిక్కెట్ సూపర్ వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రెయిన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు () నోటిఫికేషన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8113 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేశారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ ఉద్యోగాలను సెప్టెంబర్ 14వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 13ను చివరి తేదీగా నిర్ణయించారు. తాజాగా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలోనూ భారీ సంఖ్యలోనే ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. అన్ని జోన్లలోనూ కలిపి మొత్తం 8113 పోస్టులు ఉండగా, కేవలం సికింద్రాబాద్ జోన్లో మాత్రమే 478 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన రాత పరీక్ష కూడా తెలుగులోనే నిర్వహించనున్నారు.
ప్రాంతీయ భాషల్లోనూ రాయవచ్చు..
ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. కనుక అభ్యర్థులు తెలుగులో కూడా పరీక్ష రాసే వీలుంది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://rrbsecunderabad.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. మొత్తం 478 ఉద్యోగాలు ఉండగా.. చీఫ్ కమర్షియల్ కమ్ టిక్కెట్ సూపర్ వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రెయిన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర ఉద్యోగాలను సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో భర్తీ చేస్తారు.
చీఫ్ కమర్షియల్ కమ్ టిక్కెట్ సూపర్ వైజర్ పోస్టులు 25 ఖాళీగా ఉండగా, స్టేషన్ మాస్టర్ పోస్టులు 10, గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ పోస్టులు 288, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు 141, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 36 ఏళ్ల వయస్సు ఉండవచ్చు. రిజర్వేషన్లను బట్టి గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇక దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీలు, పీడబ్ల్యూడీ, ట్రాన్స్ జెండర్, మైనారిటీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.
ఎంపిక ఇలా..
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, 2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని ఉద్యోగాలకు కచ్చితంగా డాక్యుమెంట్ల పరిశీలన ఉంటుంది. తరువాతే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్లోని నోటిఫికేషన్ను అభ్యర్థులు చూడవచ్చు. అక్కడే ఆన్లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.