BSNL Tariff Plans : దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు ఈ మధ్యే తమ మొబైల్ చార్జిలను 35 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ మొబైల్ చార్జిలను భారీగా పెంచాయి. దీంతో టెలికాం వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయింది. వారు పెద్ద ఎత్తున ఆయా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ చార్జిలు భారీగా తక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా మంది మొబైల్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోయారు. ఇంకా చాలా మంది ఈ సంస్థలో చేరుతున్నారు కూడా.
సాధారణంగా ఇతర కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ చార్జిల ధరలు బాగా తక్కువే. అందువల్లే కొందరు బీఎస్ఎన్ఎల్‌లోకి కొత్తగా మారుతున్నారు. ఇక కొందరు ఉన్న తమ నంబర్లనే ఎంఎన్‌పీ ద్వారా బీఎస్ఎన్ఎల్‌లోకి మార్చుకుంటున్నారు. ఇక బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికే అత్యంత చవక ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే యూజర్లకు ఏకంగా 600 జీబీ డేటా ఇచ్చే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
395 రోజుల వాలిడిటీ ప్లాన్..
బీఎస్ఎన్ఎల్‌లో ఈ ప్లాన్‌ను మీరు గనక తీసుకుంటే మీకు ఏకంగా 395 రోజుల పాటు వాలిడిటీ లభిస్తుంది. అంటే ఏడాది కన్నా ఎక్కువే అన్నమాట. ఇతర కంపెనీల్లో అయితే ఏడాదిపాటు మాత్రమే వాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్ ద్వారా 13 నెలల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను పొందవచ్చు. అలాగే రోజుకు ఎంచక్కా 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగానే వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌ను పొందాలంటే బీఎస్ఎన్ఎల్ యూజర్లు రూ.2,399 తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
600 జీబీ డేటా ప్లాన్..
ఇక బీఎస్ఎన్ఎల్‌లో ఏడాది వాలిడిటీతో మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో వినియోగదారులకు మొత్తం 600 జీబీ డేటా వస్తుంది. అయితే దీనికి రోజువారీ లిమిట్ అంటూ ఏమీ లేదు. యూజర్లు తమకు ఎంత డేటా కావాలంటే అంత డేటాను రోజూ వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది కాగా ఇందులో 30 రోజుల పాటు ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను పొందవచ్చు. ఇక ఈ ప్లాన్‌ను రూ.1,999తో రీచార్జి చేసుకోవచ్చు.
336 రోజుల ప్లాన్..
అలాగే 336 రోజుల వాలిడిటీతో మరో ప్లాన్ కూడా బీఎస్ఎన్ఎల్‌లో అందుబాటులో ఉంది. మిగిలిన రెండు ప్లాన్‌ల కన్నా ఇది కాస్త చవకైంది. దీన్ని పొందాలంటే రూ.1499తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఉంటాయి. 24జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా వాడరు అనుకుంటే ఈ ప్లాన్‌ను రీచార్జి చేయవచ్చు. ఇక ఇదే ప్లాన్‌ను నెలవారీ పద్ధతిలో తీసుకుంటే మీకు రూ.125 అవుతాయి. ఇలా బీఎస్ఎన్ఎల్‌లో చాలా తక్కువ ధరలకే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుకనే చాలా మంది ఇప్పుడు బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోతున్నారు.