Ayushman Mitra Jobs 2024 : దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని మోదీ గతంలోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా కోట్లాది మంది పేదలకు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్య సేవలను అందిస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న చాలా మంది ప్రజలు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక గోల్డెన్ కార్డును మంజూరు చేస్తుంది. దీంతో వారు ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.
కాగా మోదీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పేదలు ఎవరైనా సరే కార్డు పొంది కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. అయితే ఈ పథకంలో భాగంగా కేంద్రం ఆయుష్మాన్ మిత్రలను నియమించాలని నిర్ణయించుకుంది. అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఆయుష్మాన్ మిత్రలుగా చేరి నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు సంపాదించుకోవచ్చు.
కేవలం ఇంటర్ చదివి ఉంటే చాలు..
ఆయుష్మాన్ మిత్రలు దేశంలోని ప్రజలకు ఆయుష్మాన్ భారత్ సేవలను అందేలా చూస్తారు. పేదలకు పథకం అందేలా అందుకు కావల్సిన సహాయ సహకారాలను ఆయుష్మాన్ మిత్రలు అందిస్తారు. ఇందుకు గాను నెల నెలా వేతనం పొందవచ్చు. ఇక ఆయుష్మాన్ మిత్రలుగా చేరాలంటే యువతీ యువకులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్ చదివి ఉంటే చాలు. విద్యార్హత పెద్దగా అవసరం లేదు.
ఆయుష్మాన్ మిత్రగా పనిచేయాలనుకునేవారు కచ్చితంగా భారతీయ పౌరుడు అయి ఉండాలి. దరఖాస్తు దారు కనీసం 12వ తరగతి చదివి అందులో పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక అభ్యర్థులు స్థానిక భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. అలాగే అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు పథకం వివరాలను చెప్పి వారిని అందులో చేర్పించడంతోపాటు వారికి అవసరం అయితే సహాయం చేయాలి.
10 లక్షల మందిని ఆయుష్మాన్ మిత్రలుగా నియామకం..
ఇక వచ్చే 5 ఏళ్లలో ఆయుష్మాన్ మిత్ర ద్వారా 10 లక్షల మందిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖల్లో 1 లక్ష మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 20వేల మంది ఆయుష్మాన్ మిత్రలను నియమిస్తారు. ఇక ఆయుష్మాన్ భారత్‌లో దేశంలోని దాదాపు 20వేలకు పైగా హాస్పిటల్స్ లిస్ట్ అయి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ మిత్రలకు ముందుగా సొంత జిల్లాలోనే శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి అయిన తరువాత వారికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాస్ అయితే ఆయుష్మాన్ మిత్రలుగా ఎంపిక చేస్తారు.
ఇక ఆయుష్మాన్ మిత్రగా పనిచేసేందుకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు https://pmjay.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందులో దరఖాస్తు ఫాం నింపాలి. వివరాలన్నింటినీ నమోదు చేయాలి. వారు అడిగే పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయుష్మాన్ మిత్ర పోస్టు కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు పూర్తవుతుంది. తరువాత అభ్యర్థులకు ట్రెయినింగ్ ఇచ్చి, పరీక్ష పెట్టి అందులో పాస్ అయిన వారిని ఆయుష్మాన్ మిత్రలుగా తీసుకుంటారు. ఇక ఇందులో గరిష్టంగా నెలకు రూ.30వేల వరకు వేతనం పొందవచ్చు. మరిన్ని వివరాలకు ముందు చెప్పిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.