ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 604 టీచర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. కేజీవీబీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు గాను అక్టోబర్ 10 వరకు గడువు విధించారు. మరిన్ని వివరాలకు లేదా ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య 604 కాగా ప్రిన్సిపాల్ పోస్టులు 10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 165, సీఆర్‌టీ పోస్టులు 163, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 4, పార్ట్ టైమ్ టీచర్ పోస్టులు 165, వార్డెన్ పోస్టులు 53, అకౌంటెంట్ పోస్టులు 44 ఖాళీగా ఉన్నాయి.
ప్రిన్సిపాల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పీజీ చేసి ఉండాలి. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పీజీ చేసి ఉండాలి. సీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి. పీఈటీ పోస్టులకు అప్లై చేసేవారు ఇంటర్ చదివి ఉండడంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ లేదా ఎంపీఈడీ పూర్తి చేసి ఉండాలి. దివ్యాంగులు ఈ పోస్టులకు అర్హులు కాదు.
ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.34వేలు, సీఆర్‌టీ పోస్టులకు రూ.26వేలు, పీఈటీ పోస్టులకు రూ.26వేలు, పీజీటీ పోస్టులకు కూడా రూ.26వేల వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి.