బెంగళూరులోని కెనరా బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బెంగళూరులో ఉన్న కెనరా బ్యాంకుకు చెందిన హ్యూమన్ రీసోర్సెస్ విభాగం ప్రధాన కార్యాలయం ఈ భారీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కెనరా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 4ను చివరి తేదీగా నిర్ణయించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను సెప్టెంబర్ 21న వెల్లడించనున్నారు. మరిన్ని వివరాలకు https://canarabank.com/pages/Recruitment అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మొత్తం 3000 ఖాళీలు ఉండగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ లేదా బీటెక్ చేసిన వారు కూడా అర్హులే.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సర కాలం పాటు శిక్షణనిస్తారు. మరిన్ని వివరాలకు సెప్టెంబర్ 21న రిలీజ్ అయ్యే నోటిఫికేషన్‌ను అభ్యర్థులు చూడవచ్చు. తరువాత పైన ఇచ్చిన వెబ్సైట్లో ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.