Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్లను తీసుకుంటుంటారు. లాకర్లలో తమకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాకర్లను తీసుకునే వారు లాకర్ సైజ్‌ను బట్టి దానికి నిర్దిష్టమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాకర్లను తీసుకునేవారు పలు నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్లలో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, బ్యాంకు లాకర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో కొన్ని వస్తువులను మాత్రమే పెట్టాలి. ఉదాహరణకు మీకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను లాకర్లలో పెట్టుకోవచ్చు. కానీ కరెన్సీ నోట్లను లాకర్లలో పెట్టకూడదు. ఇది చాలా మంది చేసే తప్పు. ఇక లాకర్లలో వెపన్స్ (ఆయుధాలు), పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ను కూడా పెట్టరాదు. చెడిపోయే పదార్థాలను కూడా లాకర్లలో ఉంచరాదు. అలాగే రేడియోధార్మిక పదార్థాలు, నిషేధించబడిన వస్తువులను కూడా లాకర్లలో పెట్టరాదు. ఇలా లాకర్లలో పెట్టే వస్తువుల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్టపరంగా మీకు ఇబ్బందులు వస్తాయి.
లాకర్ తాళం చెవి పోతే..?
ఇక బ్యాంకు లాకర్‌ను మీరు మొదటిసారి తీసుకున్నప్పుడు మీకు బ్యాంకు వారు ఒక తాళం చెవి ఇస్తారు. బ్యాంకు మేనేజర్ వద్ద రెండో తాళం చెవి ఉంటుంది. రెండు తాళం చెవులను పెడితేనే లాకర్ ఓపెన్ అవుతుంది. అలా లాకర్ ఓపెన్ అయ్యాక బ్యాంక్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత మీరు మీ లాకర్లో మీ వస్తువులను లేదా పత్రాలు, నగలను పెట్టుకోవచ్చు. లేదా ఉన్న వాటిని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక మీ వద్ద ఉన్న తాళం చెవి పోతే బ్యాంకు వారు డూప్లికేట్ తాళం చెవి ఇస్తారు. కానీ అది సురక్షితం కాదు. అటువంటప్పుడు మీరు ఇంకో లాకర్‌ను తీసుకోవాలి.
అయితే మీరు ఉపయోగించిన లాకర్ తాళం చెవి పోయింది కనుక మీరు అప్పుడు దానికి కొత్త తాళాలకు అయ్యే ఖర్చులను భరించాలి. దీంతో బ్యాంకు వారు మీకు ఇంకో లాకర్‌ను ఇస్తారు. ఇక లాకర్ డ్యామేజ్ అయ్యేందుకు బ్యాంకు వారు కారణం అయినా లేదా వారి దగ్గర ఉన్న తాళం చెవి పోయినా వారే లాకర్ డ్యామేజ్ ఖర్చులను భరించాలి. ఇలా లాకర్లను ఆపరేట్ చేస్తారు. ఇక మీరు లాకర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకుకు చెందిన ఎవరూ కూడా మీ దగ్గర ఉండకూడదు. ఎవరైనా ఉంటే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
ఈ సందర్భాల్లో బ్యాంకు, లాకర్‌ను ఓపెన్ చేస్తుంది..
అయితే మీరు చట్ట వ్యతిరేక పనులు చేసినప్పుడు మీ మీపై క్రిమినల్ కేసులు నమోదు అయితే మీ లాకర్లను బలవంతంగా ఓపెన్ చేయించేందుకు అప్పుడు పోలీసులకు అధికారాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ సమక్షంలో వారు బ్యాంకు అధికారులతో కలిసి లాకర్‌ను ఓపెన్ చేయిస్తారు. అలాగే లాకర్లలో మీరు నిషేధిత వస్తువులు లేదా పదార్థాలను పెట్టారని అనుమానం వచ్చినా మీ లాకర్‌ను పోలీసులు బ్రేక్ చేసేందుకు అధికారం ఉంటుంది.
ఇక మీరు లాకర్ తీసుకున్న తరువాత 3 ఏళ్ల వరకు దానికి ఎలాంటి రుసుము చెల్లించకపోతే మీ లాకర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి అందులోని వస్తువులను వేలం వేసి లాకర్ రుసుమును వసూలు చేసుకునే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అయితే మీరు 7 ఏళ్ల నుంచి లాకర్‌కు రుసుము చెల్లిస్తున్నా మీరు కనీసం ఈ కాలంలో ఒక్కసారి అయినా లాకర్‌ను ఓపెన్ చేయకపోతే అలాంటి లాకర్‌ను కూడా బ్యాంకు వారు బలవంతంగా తెరుస్తారు. ఆ అధికారం కూడా వారికి ఉంటుంది. ఇలా లాకర్లను ఉపయోగించే వారు పలు రూల్స్‌ను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.