ఆధార్ కార్డును ప్రస్తుతం మనం అనేక సేవలకు ఉపయోగిస్తున్నాం. అనేక ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకింగ్ అవసరాలకు, సిమ్ కార్డులను తీసుకోవాలన్నా, ఇతర సేవలకు కూడా ఆధార్ కార్డునే వినియోగిస్తున్నాం. ఒక సర్వే ప్రకారం దేశ జనాభాలో 90 శాతం మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారని వెల్లడైంది. అయితే ఆధార్ కార్డులను వాడుతున్న వారికి ఎప్పటినుంచో ఒక సందేహం ఉంటోంది. అదేమిటంటే..
ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ లేదా సిటిజెన్ షిప్ (పౌరసత్వ) ధ్రువపత్రంగా వాడుకోవచ్చా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ మీద ఉంటుంది కనుక దాన్ని ఆ ప్రూఫ్‌గా వాడుకోవచ్చని.. అలాగే ఆధార్ కార్డు కనుక పాస్‌పోర్టు తరహాలో ఉపయోగించుకోవచ్చని చాలా మంది నమ్ముతుంటారు. అయితే దీనిపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
2018లో కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధార్ కార్డు విషయంలో కొన్ని స్పష్టతలను ఇచ్చింది. ఆధార్ కార్డుపై డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా వాడుకోరాదు. అలాగే పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించడానికి వీలు లేదని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కనుక ఆధార్‌ను ఈ రెండు సేవలకు ఉపయోగించరాదు. లేదంటే మీరు పెట్టే అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇక ఆధార్‌ను ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా మీ ఆధార్‌ను ఐడీ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా అంగీకరించకపోతే మీరు యూఐడీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఈవిధంగా మీరు ఆధార్ కార్డును ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.