CIBIL Score Update : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా CIBIL స్కోరుపై ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు RBI కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం వినియోగదారుల క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇకపై వేగంగా అప్డేట్ అవుతుంది. RBI గవర్నర్ శక్తి కాంత దాస్ ఇటీవలే మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) RBI ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ప్రతి నెలా లేదా కొంత సమయం తరువాత వినియోగదారులకు చెందిన CIBIL స్కోర్ అప్డేట్ అయ్యేది. కానీ కొత్త RBI రూల్ ప్రకారం ఇకపై వినియోగదారుల CIBIL స్కోర్ ప్రతి 2 వారాలకు ఒకసారి అప్డేట్ అవుతుంది. దీంతో వినియోగదారులకే కాక ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతి 2 వారాలకు ఒకసారి సిబిల్ అప్డేట్..
ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా లోన్లను లేదా క్రెడిట్ కార్డు బిల్లులను కట్టే వినియోగదారులకు ఇకపై సిబిల్ స్కోర్ వేగంగా అప్డేట్ అవుతుంది కనుక వారి క్రెడిట్ హిస్టరీ చాలా త్వరగా మారుతుంది. దీంతో వారు మరిన్ని లోన్లు లేదా కార్డులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు కూడా వినియోగదారులకు చెందిన తాజా క్రెడిట్ హిస్టరీ లభిస్తుంది. దీంతో వారు వినియోదారులకు లోన్లు లేదా కార్డులు ఇవ్వాలా.. వద్దా.. అని రిస్క్ అంచనా వేసి త్వరగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా 2 వారాలకు ఒకసారి సిబిల్ అప్డేట్ వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని ఆర్బీఐ తెలియజేసింది.
కాగా దేశంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో సిబిల్ కూడా ఒకటి. దీంట్లో సిబిల్ స్కోర్ 0 నుంచి 999 మధ్య ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తికి చెందిన సిబిల్ స్కోరు 700కి పైగా ఉంటే మంచిదని భావిస్తారు. 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే లోన్ లేదా క్రెడిట్ కార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకు క్రెడిట్ హిస్టరీ బాగుంటుందని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. కనుక 750కి పైగా సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు లేదా క్రెడిట్ కార్డులు త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
60 కోట్ల మంది డేటా..
ఇక సిబిల్ వద్ద దేశంలోని 60 కోట్ల మందికి చెందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ డేటా ఉంది. దీంట్లో 2400 ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులు భాగస్వామ్యంగా ఉన్నాయి. మారిన రూల్స్ ప్రకారం ఈ సంస్థలు మరియు బ్యాంకులు ఇకపై ప్రతి 2 వారాలకు ఒకసారి కస్టమర్లకు చెందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ను సిబిల్‌కు అందించాలి. దీంతో సిబిల్.. కస్టమర్లకు చెందిన స్కోర్‌ను అప్డేట్ చేస్తుంది. ఇలా స్కోర్ ఇకపై వేగంగా అప్డేట్ అవుతుంది.