CISF Constable Fire Male Recruitment 2024 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. CISFలో ఖాళీగా ఉన్న 1130 కానిస్టేబుల్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను CISF తాజాగా వివరాలను ప్రకటించింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31, 2024 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024.
కానిస్టేబుల్, ఫైర్ విభాగంలో మొత్తం 1130 ఖాళీలు ఉన్నట్లు CISF వెల్లడించింది. జనరల్ విభాగంలో 466 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 114, ఓబీసీ కోటాలో 236, ఎస్సీ కోటాలో 153, ఎస్‌టీ కోటాలో 161 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులకు అభ్యర్థులకు వయస్సు సెప్టెంబర్ 30, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో 3 ఏళ్లు సడలింపు ఇస్తారు. ఎస్సీ, ఎస్‌టీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఇస్తారు.
ఇంటర్ చదివి ఉండాలి..
ఇంటర్మీడియట్‌లో సైన్స్ సబ్జెక్ట్‌తో పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతి 80-85 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. 24 నిమిషాల్లో 5 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఫీజు చెల్లించే వారు మాత్రం ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
100 మార్కులకు పరీక్ష..
అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. రాత పరీక్ష వ్యవధి 2 గంటలు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది. మొత్తం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించారు.
జీతం నెలకు రూ.69వేలు..
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, జీకే అండ్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమాటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో 25 ప్రశ్నలకు 25 మార్కులు.. మొత్తం కలిపి 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఇస్తారు. సబ్‌మిట్ చేసిన దరఖాస్తు ఫామ్‌లలో ఏవైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకునేందుకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 12, 2024 మధ్య సమయం కేటాయించారు. పీఈటీ లేదా పీఎస్‌టీ తేదీలు, రాత పరీక్ష తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://cisfrectt.cisf.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.