CISF Constable Recruitment 2024 : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. CISF దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్లకు చెందిన పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలో యూనిట్లకు రక్షణ నిమిత్తం పలు పోస్టులను ఈ రిక్రూట్మెంట్లో భర్తీ చేయనున్నారు. CISFలో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా 1130 మేర కానిస్టేబుల్ లేదా ఫైర్ (మేల్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందులో యూఆర్ 466 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 114, ఎస్సీ 153, ఎస్టీ 161, ఓబీసీ 236 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్ చదివితే చాలు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా సెప్టెంబర్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://cisfrectt.cisf.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 1130 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 32, తెలంగాణలో 26 ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు కనీస ఎత్తు 170 సెంటీ మీటర్లు ఉండాలి. ఛాతి 80 నుంచి 85 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఇస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రాత పరీక్ష, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.