పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు గాను కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అందుకనే విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి భారీగా కేంద్రం సబ్సిడీని కూడా అందిస్తోంది. దీంతోపాటు మైలేజ్‌కు, మెయింటెనెన్స్‌కు అతి తక్కువ ఖర్చు అవుతున్నాయి కనుక ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్లతోపాటు బైక్‌లను కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక మార్కెట్లో మనకు భిన్న రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి.
టూవీలర్లతోపాటు కార్లను కూడా ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా తయారు చేసి మనకు అందిస్తున్నాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లే తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ స్కూటర్లపై ఈ ఏడాది, గతేడాది చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఎండలో కాసేపు ఉంచితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగాయి కూడా.
అలాగే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొంటున్న వినియోగదారులు కూడా స్కూటర్లలో తరచూ ఏదో ఒక సమస్య వస్తుందని, వాటిని సరిగ్గా పరిష్కరించలేకపోతున్నారని కూడా కంప్లెయింట్ చేస్తున్నారు. అయితే ఇలాగే ఓ కస్టమర్ కు కూడా జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కర్ణాటకలోని కళబురగి అనే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల మహమ్మద్ నదీమ్ వృత్తి రీత్యా మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యే అతను రూ.1.40 లక్షలు పెట్టి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొన్నాడు. ఏ వేరియెంట్‌ను కొనుగోలు చేసింది చెప్పలేదు.
Angry #Ola customer sets #fire to electric scooter showroom in #Kalaburagi in North #Karnataka.
Mohammed Nadeem was frustrated with the new bike as it developed snags frequently. The showroom staff did not respond properly despite multiple appeals, he told cops. pic.twitter.com/EE3ahF1lSc
— TOI Bengaluru (@TOIBengaluru) September 11, 2024
కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొన్నప్పటి నుంచి తరచూ ఏదో ఒక టెక్నికల్ సమస్య వస్తుందని, షోరూంకు తీసుకెళ్లినా వారు సమస్యను పరిష్కరించలేకపోతున్నారని అన్నాడు. దీంతో నదీమ్‌కు చిర్రెత్తుకొచ్చింది. సెప్టెంబర్ 10వ తేదీ నాడు షోరూంకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ పలు బైక్‌లు, కంప్యూటర్లు కాలిపోయాయి. దీంతో ఆ షోరూం వాళ్లకు రూ.8.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. అయితే నిందితుడు నదీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఓలాకు చెందిన ఎలక్టిక్ స్కూటర్లపై తరచూ చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ కంపెనీ అసలు సమస్య ఎక్కడ వస్తుందో చెక్ చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుందా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.