Debit Card Stuck In ATM Machine : ఇప్పుడంటే చాలా మంది నగదుకు బదులుగా డిజిటల్ లావాదేవీలనే నిర్వహిస్తున్నారు. కానీ యూపీఐ పేమెంట్స్ రాక ముందు వరకు మనం నగదునే ఇచ్చేవాళ్లం. డిజిటల్ లావాదేవీల వల్ల ఎంతో సమయం ఆదా అవడంతోపాటు చిల్లర బెడద ఉండదు. అలాగే చాలా సేఫ్టీ ఉంటుంది. అయితే ఇప్పటికీ కొన్ని రకాల పేమెంట్లు చేయాలన్నా, కొందరికి డబ్బులు ఇవ్వాలన్నా.. నగదును ఏటీఎంలలో నుంచి తీయాల్సి వస్తోంది. అక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని సార్లు మనం ఏటీఎంలలో నగదును విత్ డ్రా చేసే సమయంలో ఇబ్బందులు పడుతుంటాం.
ముఖ్యంగా ఏటీఎం మెషిన్లో కొన్నిసార్లు కార్డులు స్టక్ అవుతుంటాయి. దీంతో మనం ఆందోళన చెందుతాం. అయితే ఏటీఎం యంత్రంలో కార్డు స్టక్ అయిపోతే కంగారు పడాల్సిన పనిలేదు. ఆ సమయంలో ఏం చేయాలంటే.. మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలి. దీంతో వారు వెంటనే కార్డును బ్లాక్ చేస్తారు. ఇక ఆ కార్డు పనిచేయదు. అందువల్ల ఆ కార్డు బయటకు వచ్చినా ఏమీ కాదు. ఎలాగూ మీకు కొత్త డెబిట్ కార్డు ఇంటికి వస్తుంది.
టెంపరరీగా బ్లాక్ చేసుకోవచ్చు..
ఇక కొన్ని బ్యాంకులు అయితే డెబిట్ కార్డులను టెంపరరీగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అందుకు గాను బ్యాంకు యాప్‌లో డెబిట్ కార్డు సెక్షన్ ను ఓపెన్ చేసి అందులో కార్డును టెంపరరీగా బ్లాక్ చేయాలి. దీంతో మీ కార్డు పనిచేయదు. అప్పుడు మీరు ఆ ఏటీఎంకు చెందిన బ్యాంకు వారికి సమాచారం ఇవ్వాలి. దీంతో వారు ఏటీఎంను తెరిచినప్పుడు మీ కార్డును మీకు ఇస్తారు. తరువాత మీరు మళ్లీ యథావిధిగా బ్యాంకు యాప్‌లోకి వెళ్లి డెబిట్ కార్డు సెక్షన్లో బ్లాక్ అయి ఉన్న కార్డును అన్‌బ్లాక్ చేస్తే చాలు, దీంతో మీ డెబిట్ కార్డు యథావిధిగా పనిచేస్తుంది. ఈ విధంగా అలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సి ఉంటుంది.
అయితే కొన్ని ఏటీఎంలు బ్యాంకులతో కలిసి ఉంటాయి. అలాంటి ఏఎంటీలలో గనుక మీ డెబిట్ కార్డు స్టక్ అయితే వెంటనే బ్యాంకులోకి వెళ్లి సిబ్బందిని సహాయం అడగవచ్చు. దీంతో వారు వీలుంటే వెంటనే మెషిన్‌ను ఓపెన్ చేయించి మీ కార్డును మీకు ఇప్పిస్తారు. అయితే ఏటీఎంలను నిర్వహించే సిబ్బంది వేరే ఉంటారు కనుక వారు వచ్చి మెషిన్‌ను ఓపెన్ చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భంలో కూడా మీరు మీ కార్డును టెంపరరీగా బ్లాక్ చేసుకోవచ్చు. తరువాత మీ కార్డు మీకు చేరగానే మళ్లీ అన్‌బ్లాక్ చేయవచ్చు. ఇలా మీ డెబిట్ కార్డులను సురక్షితంగా ఉంచుకోవచ్చు.