E-Luna X2 : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కార్లు లేదా టూవీలర్లు ఏవైనా సరే ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టూవీలర్లలోనూ చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇక వినియోగదారులకు తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ అందుబాటులోకి వచ్చింది. అదే.. E Luna X2. దీన్ని రీసెంట్‌గానే మార్కెట్‌లోకి లాంచ్ చేశారు.
కైనెటిక్ గ్రీన్ అనే కంపెనీ E Luna X2 మోపెడ్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ మోపెడ్‌లో ఉన్న బ్యాటరీలను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఏకంగా 110 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఈ మోపెడ్ గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇందులో 2కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేసేందుకు సుమారుగా 4 గంటల వరకు సమయం పడుతుంది.
ఏడాదికి రూ.56వేలు ఆదా..
ఇక ఈ మోపెడ్‌లో స్టీల్ చాసిస్, హై ఫోకల్ హెడ్‌లైట్, డిజిటల్ మీటర్, సేఫ్టీ లాక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డిటాచబుల్ రియర్ సీట్, బ్యాగ్ హుక్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్టు, సైడ్ స్టాండ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ లూనాను కొనుగోలు చేసేవారు ఏడాదికి రూ.56వేలను ఆదా చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఎలాగంటే పెట్రోల్ టూవీలర్ అయితే 55 కిలోమీటర్లు మైలేజ్ అనుకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ.105గా ఉంది. 26 రోజులకు రూ.5వేలు అవుతాయి. అంటే ఏడాదికి దాదాపుగా రూ.56వేలు అవుతాయి.
కానీ E Luna X2 ద్వారా నెలకు రూ.248 మాత్రమే ఖర్చు వస్తుంది. యూనిట్‌కు రూ.5.25 ఖర్చు అనుకుంటే ఇలా అవుతుంది. రోజుకు రూ.10 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. అందువల్ల E Luna X2 మోపెడ్‌ను కొంటే వినియోగదారులు పెద్ద ఎత్తున ఇంధనం రూపంలో డబ్బులను ఆదా చేయవచ్చు. ఇక ఈ మోపెడ్ ధర రూ.79,990 ఉండగా.. దీన్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. రూ.500 కడితే చాలు.. ప్రీ బుకింగ్ అవుతుంది. పలు రకాల కలర్స్‌లోనూ అందుబాటులో ఉంది. అయితే ప్రీబుకింగ్ చేసుకున్న వారు స్టాక్ రాగానే ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. రోజూ చాలా తక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఎంతగానో సౌకర్యంగా ఉంటుంది. పైగా డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ఈ కంపెనీ వెబ్ సైట్‌లో ఈ మోపెడ్‌ను బుక్ చేసుకోవచ్చు.