FASTag New Rules : ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఇలా చేయ‌క‌పోతే ట్యాగ్ ప‌నిచేయ‌దు..!

FASTag New Rules : నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు గాను నూత‌న నిబంధ‌న‌ల‌ను తాజాగా అమ‌లులోకి తెచ్చింది. ఆగ‌స్టు 1, 2024 నుంచి ఈ నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం 3-5 ఏళ్ల కింద‌ట ఫాస్టాగ్ పొందిన వినియోగ‌దారులు త‌మ కేవైసీని మ‌ళ్లీ ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అక్టోబ‌ర్ 31, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఇక 5 ఏళ్ల కింద‌ట ఫాస్టాగ్ పొందిన వారు త‌మ ట్యాగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల ఫాస్టాగ్ వాడ‌కంలో ఎలాంటి ఇబ్బందులు రావు.

ఇక కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆగ‌స్టు 1, 2024 నుంచి మంజూరు చేసే ఫాస్టాగ్‌లు త‌ప్ప‌నిస‌రిగా ఫోన్ నంబ‌ర్ల‌కు లింక్ అయి ఉండాలి. ఒక ఫాస్టాగ్‌కు ఒక ఫోన్ నంబ‌ర్ లింక్ అయితే దానికి త‌ప్ప‌నిస‌రిగా వాహ‌న రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, చాసిస్ నంబ‌ర్‌ అనుసంధానం అయి ఉండాలి. ఫాస్టాగ్ వినియోగ‌దారులు అంద‌రూ ఇలా అనుసంధానం అయి ఉండేలా ఫాస్టాగ్ మంజూరుదారులు బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారు వినియోగ‌దారుల కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

FASTag New Rules follow these and complete kyc or else tag will be deactivated
FASTag New Rules

కొత్త వాహ‌నాల‌కు 90 రోజులు గ‌డువు..

ఇక కొత్త‌గా వాహ‌నం తీసుకున్న వారు త‌మ ఫాస్టాగ్‌కు ఫోన్ నంబర్‌, చాసిస్ నంబ‌ర్ల‌ను లింక్ చేయాలి. అనంతరం 90 రోజుల్లోగా ఆ ఫాస్టాగ్‌కు వాహ‌న రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేయాలి. అలా చేయ‌లేక‌పోతే మ‌రో 30 రోజుల పాటు ఆ ఫాస్టాగ్‌ను హాట్‌లిస్ట్‌లో పెడ‌తారు. ఆ త‌రువాత కూడా ఫాస్టాగ్‌కు వాహ‌న రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌ను లింక్ చేయ‌క‌పోతే అప్పుడు ఆ ఫాస్టాగ్‌ను డీ యాక్టివేట్ చేస్తారు. దీంతో వాహ‌న‌దారుడు మ‌ళ్లీ కొత్త ఫాస్టాగ్‌ను పొందాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ వాడ‌కంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా ఉండ‌డంతోపాటు ఇందులో మోసాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు గాను ఇలా కేవైసీ నిబంధ‌న‌ల‌ను అమలులోకి తెచ్చిన‌ట్లు ఎన్‌పీసీఐ వెల్ల‌డించింది. ఇక ఫాస్టాగ్ వివ‌రాల‌ను వాహ‌న్ డేటాబేస్ లేదా మంజూరుదారు ద‌గ్గ‌ర వెరిఫై చేసుకోవ‌చ్చు.