RBI : పూర్వ కాలంలో బ్యాంకు ఖాతాలను తెరవాలంటే అదో ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. కంప్యూటర్ల వాడకం చాలా తక్కువ కావడంతో పేపర్ వర్క్ ఎక్కువగా జరిగేది. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకుల్లో డబ్బులను దాచుకునేందుకు వెనుకడుగు వేసేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు మారిపోయారు. ప్రభుత్వాలు నల్ల ధనంపై కొరడా ఝులిపిస్తుండడంతో డబ్బును ఇళ్లలో లేదా ఇతర ఎక్కడైనా సరే దాచుకునేందుకు వీలు లేకుండా పోయింది. కానీ కొందరు తమకు తెలిసిన మార్గాల్లో ఎక్కువ బ్యాంకు ఖాతాలను తెరిచి వాటిల్లో డబ్బు పొదుపు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంచితే బ్యాంకు ఖాతాలపై అసలు ఆర్బీఐ ఏం చెబుతోంది ? ఏ వ్యక్తి అయినా సరే గరిష్టంగా ఎన్ని బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండవచ్చు ? దీనిపై ఆర్బీఐ నిబంధనలు ఏమైనా ఉన్నాయా ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్ని అకౌంట్లు ఉండాలి..?
దేశంలోని ఏ వ్యక్తి అయినా సరే ఎన్ని బ్యాంకు ఖాతాలను అయినా సరే కలిగి ఉండవచ్చు. వాటిల్లో సేవింగ్స్, కరెంట్ అకౌంట్.. తదితర ఖాతాలు వస్తాయి. ఎవరు ఎన్ని అయినా బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. ఇందుకు పరిమితి అంటూ ఏమీ లేదు. ఆదాయం ఎక్కువగా ఉన్న వారు ఎక్కువగా అకౌంట్లను తెరుస్తారు. అదే తక్కువ ఆదాయం ఉంటే 1 లేదా 2 అకౌంట్లను నిర్వహిస్తారు. ఇక కొందరు అవసరం లేకున్నా ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. అలాంటి వారు ఖాతాలను నిర్వహించాలంటే అందుకు గాను మినిమం బ్యాలెన్స్‌ను వాటిల్లో మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మినిమం బ్యాలెన్స్ పెట్టలేని ఖాతాలను క్లోజ్ చేయడం మంచిది. దీనికి ఎలాంటి ఫీజు తీసుకోకూడదని ఆర్బీఐ బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇక మినిమం బ్యాలెన్స్ పేరిట బ్యాంకులు కస్టమర్ల నుంచి ఫీజు వసూలు చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలో అసలు డబ్బు లేకపోతే దాన్ని మైనస్ చేయకూడదు. సాధారణంగా ఖాతాలో డబ్బు లేనప్పుడు మినిమం బ్యాలెన్స్ ఫీజు పడితే అప్పుడు ఖాతా బ్యాలెన్స్ మైనస్‌లోకి వెళ్తుంది. కానీ ఇలా మైనస్ బ్యాలెన్స్ చేయకూడదని ఆర్బీఐ ఇప్పటికే అనేక సార్లు బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను పాటించడం లేదని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక మినిమం బ్యాలెన్స్ లేక మైనస్‌లోకి వెళ్లిన ఖాతాలను క్లోజ్ చేయాలంటే అందుకు కూడా కస్టమర్ల నుంచి బ్యాంకులు ఎలాంటి ఫీజును వసూలు చేయకూడదని కూడా ఆర్బీఐ చెబుతోంది.
నగదు డిపాజిట్లపై జాగ్రత్తగా ఉండాలి..
అయితే ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నప్పటికీ నిబంధనలను పాటించాలి. ఒక ఏడాదిలో ఒక అకౌంట్లో రూ.10 లక్షలకు మించి నిర్వహించే నగదు డిపాజిట్లపై జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి లావాదేవీలపై బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు ఎప్పటికప్పుడు వివరాలను సమర్పిస్తాయి. కనుక ఈ తరహా లావాదేవీలు నిర్వహించేవారు క్రమం తప్పకుండా పన్ను కడుతున్నారా.. లేదా.. అని ఆలోచించుకోవాలి. పన్ను కడితే ఎలాంటి సమస్య రాదు.
ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నవారు ఒక్కో ఖాతాను ఒక్కో అవసరం కోసం వాడుతుంటారు. కొందరు బ్యాంకులు అందించే ప్రయోజనాలను పొందేందుకు కూడా ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తారు. దీంతో బ్యాంకింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది. అయితే మినిమం బ్యాలెన్స్, పలు రకాల సేవలపై బ్యాంకులు వసూలు చేసే ఫీజు ఇలాంటి వాటిని కూడా కస్టమర్లు దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే ఎక్కువ మొత్తంలో చార్జిలను చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఎవరైనా సరే ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించవచ్చు. అందుకు ఎలాంటి పరిమితి లేదు. ఎవరు ఎన్ని బ్యాంకు ఖాతాలను అయినా సరే కలిగి ఉండవచ్చు.