ISRO Recruitment 2024 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. జీతం నెలకు రూ.1.42 లక్షల వరకు పొందవచ్చని తెలియజేసింది. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)లో పనిచేయాల్సి ఉంటుంది.
వెల్డర్, ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్, టర్నర్, మెషినిస్ట్, హెవీ వెహికిల్ డ్రైవర్ ఎ, కుక్, లైట్ వెహికిల్ డ్రైవర్ ఎ, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://www.isro.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27, 2024న ప్రారంభం కాగా సెప్టెంబర్ 10, 2024వ తేదీన ముగుస్తుంది.

విద్యార్హతల వివరాలు..
మెకానికల్ పోస్టులకు గాను అభ్యర్థులు సంబంధిత విభాగంలో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎన్‌సీవీటీ నుంచి వెల్డర్ ట్రేడ్ పత్రాన్ని పొంది ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవర్ ఎ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు టెన్త్ పాస్ అయి ఉండాలి. కనీసం 5 ఏళ్లు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. లేదా 3 ఏళ్లు హెవీ వెహికిల్, 2 ఏళ్లు లైట్ వెహికిల్ అనుభవం ఉన్నా సరిపోతుంది. అలాగే హెవీడీ లైసెన్స్‌తోపాటు పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జిని కలిగి ఉండాలి.
లైట్ వెహికిల్ డ్రైవర్ ఎ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు టెన్త్ చదివి ఉండాలి. అలాగే కనీసం 3 ఏళ్లు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. వీరు కచ్చితంగా ఎల్‌వీడీ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అప్లికేషన్ ఇలా సబ్‌మిట్ చేయాలి..
వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత రిజిస్టర్డ్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. తరువాత సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం నిర్ణీత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత డిటెయిల్స్ చెక్ చేసుకుని అప్లికేషన్ ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. అవసరం అనుకుంటే సబ్‌మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోవచ్చు. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇలా ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.