Kaloji University MBBS BDS Admissions : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. నీట్ యూజీ 2024 పరీక్షలో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో సంబంధిత ధ్రువ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఇక పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ http://www.knruhs.telangana.gov.in/ ను విద్యార్థులు సందర్శించవచ్చు.
పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కూడా నోటిఫికేషన్..
కాగా పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కూడా నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. నీట్-ఎండీఎస్ 2024 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎండీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఇందుకు గాను ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. అధికారిక వెబ్సైట్ https://tsmds.tsche.in/ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నీట్ ఎండీఎస్ పరీక్షలో కటాఫ్ స్కోర్‌ను కూడా ప్రకటించారు.
జనరల్ విభాగంలో 800లకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగంలో 40 శాతం, దివ్యాంగులకు 45 శాతాన్ని కటాఫ్‌గా నిర్ణయించారు. కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నీట్ ఎండీఎస్ పరీక్షలో అర్హతతోపాటు తెలంగాణలోని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించిన బీడీఎస్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు 9392685856, 9059672216 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా tspgmed2024@gmail.com కు మెయిల్‌ను పంపించవచ్చు.