Lakhpati Didi Yojana Scheme : కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. అయితే కేవలం మహిళలకు మాత్రమే కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో లఖ్పతి దీదీ యోజన పథకం కూడా ఒకటి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గతంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలను అందిస్తారు. వారు చేయాలనుకున్న వ్యాపారం లేదా పెట్టాలనుకున్న పరిశ్రమను బట్టి లోన్‌ను రూ.1 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తారు. ఇక ఈ పథకానికి గాను గత బడ్జెట్లో రూ.2 కోట్లను కేటాయించగా, ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకానికి బడ్జెట్‌ను కాస్త పెంచారు. ఈ పథకం కోసం ప్రస్తుతం రూ.3 కోట్లను కేటాయించారు. దీంతో మరింత మంది మహిళలకు ఈ పథకం కింద లోన్ లభించనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్పతి దీదీ యోజన స్కీమ్‌ను పొందాలంటే మహిళలు ఏదైనా స్వయం సహాయక గ్రూప్‌లో సభ్యురాలై ఉండాలి. అలాంటి గ్రూప్‌లో ఉన్న మహిళలకే ఈ స్కీమ్ కింద రుణాలను ఇస్తారు. ఇందులో భాగంగా వడ్డీ లేకుండా రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. డిసెంబర్ 2023లో దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 90 లక్షల వరకు మహిళలకు చెందిన స్వయం సహాయక గ్రూప్‌లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం సుమారుగా 10 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ పథకం కింద వారికి ఎంతో లబ్ధి జరగనుంది.
లోన్‌తోపాటు శిక్షణ కూడా ఇస్తారు..
లఖ్పతి దీదీ యోజన కింద లోన్ తీసుకోవాలంటే స్వయం సహాయక గ్రూప్ ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో గ్రూప్‌కు లోన్ ఇస్తారు. ఆ లోన్‌ను గ్రూప్‌లోని మహిళలు పంచుకోవచ్చు. ఇందులో భాగంగా అవసరం అయితే మహిళలకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తారు. వారు చేయాలనుకునే వ్యాపారం లేదా పెట్టాలనుకునే పరిశ్రమను బట్టి శిక్షణ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా మహిళలు పౌల్ట్రీ పరిశ్రమలు పెట్టవచ్చు. లేదా ఎల్ఈడీ బల్బులను తయారు చేసి విక్రయించవచ్చు. అలాగే వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు.
స్ట్రాబెర్రీలను పెంచడం, పశువులు, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, చేతి వృత్తులు, చేనేత వస్త్రాల తయారీ, మేకల పెంపకం వంటి పనులు చేయవచ్చు. ఇందుకు గాను ఈ పథకం కింద మహిళలు తమ స్వయం సహాయక గ్రూప్ ద్వారా లోన్ పొందవచ్చు. ఇక మరిన్ని వివరాలకు గాను https://lakhpatididi.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దీంతో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.