LIC Jeevan Shanti Policy : ప్రతి ఒక్కరు తమ జీవితకాలంలో ఎంతో కొంత డబ్బు సంపాదించి పొదుపు చేసి రిటైర్మెంట్ అనంతరం హాయిగా కాలం గడపాలని అనుకుంటారు. అందుకనే చాలా మంది తాము సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పిల్లల కోసం పొదుపు చేస్తూనే.. మరికొంత భాగాన్ని తమ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎందులో అయినా పెట్టుబడిగా పెడుతుంటారు. దీంతో రిటైర్ అవగానే డబ్బును పొందుతూ హాయిగా కాలం వెళ్లదీయవచ్చు. అయితే ఇందుకు గాను అనేక సంస్థలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. కానీ ఎల్ఐసీలో మాత్రం ఓ అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక ఆ ప్లాన్ ఏమిటో, దాని వివరాలు ఏమిటో, అందులో డబ్బులను ఎలా పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్ఐసీ సంస్థ అందిస్తున్న అనేక పాలసీల్లో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఇది పూర్తిగా రిటైర్మెంట్ ఫండ్ పాలసీ అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా డబ్బును ఒక్కసారి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. దీంతో రిటైర్మెంట్ అనంతరం ఏటా నిర్దిష్టమైన మొత్తంలో పెన్షన్ను పొందవచ్చు. ఇందులో భాగంగా ఎవరైనా సరే కనీసం రూ.1.50 లక్షలను పెట్టాలి. గరిష్టంగా ఎంత మొత్తం అయినా ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇక ఈ పాలసీలో ఏడాదికి రూ.1 లక్ష పొందాలంటే ఎంత పెట్టాలో ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఏడాది రూ.1 లక్ష ఇలా పొందవచ్చు..
ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీలో భాగంగా మీరు ఒకేసారి రూ.11 లక్షలను పెట్టాలి. మీ వయస్సు 55 ఏళ్లు అనుకుంటే మీరు ఇందులో రూ.11 లక్షలను ఒకసారి పెడితే చాలు. మీకు 60 ఏళ్లు వచ్చాక అప్పటి నుంచి ప్రతి ఏటా రూ.1,02,850 పొందవచ్చు. ఇలా ఈ పాలసీలో ప్రతి ఏడాది నిర్దిష్టమైన మొత్తాన్ని పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. ఇక ఈ మొత్తాన్ని 6 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే 6 నెలలకు రూ.50,365 వస్తాయి. అదే నెలకు ఒకసారి తీసుకునేట్లు ప్లాన్ చేస్తే మీకు నెలకు రూ.8,217 వస్తాయి.
ఇలా ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీలో మీరు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి చీకు చింతా లేకుండా జీవించవచ్చు. ఇక ఈ పాలసీలో 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు డబ్బును పెట్టవచ్చు. అలాగే ఈ పాలసీకి నామినీని పెట్టుకోవచ్చు. పాలసీ హోల్డర్ చనిపోతే అప్పుడు అతను డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే ఈ పాలసీని మీరు ఎప్పుడైనా సరే వద్దనుకుంటే వెంటనే సరెండర్ చేయవచ్చు. ఇలా ఈ పాలసీతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.