LIC Kanyadan Policy : ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు వారు పుట్టినప్పటి నుంచే అనేక రకాల పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెడుతుంటారు. దీంతో వారు పెద్దయ్యాక వారి పెళ్లి లేదా చదువులకు పనికొస్తాయన్న ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. ఆడపిల్ల పుట్టిన తరువాత వారి కోసం తల్లిదండ్రులు డబ్బును అనేక రకాలుగా పొదుపు చేస్తారు. ఇక ఇందులో భాగంగానే ఆర్థిక, బీమా సంస్థలు, బ్యాంకులు పలు రకాల పథకాలను అందిస్తున్నాయి. వాటిల్లో ఎల్ఐసీ అందిస్తున్న కన్యాదాన్ పాలసీ కూడా ఒకటి. దీన్ని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వరమనే చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ద్వారా ఆడపిల్ల పెద్దయ్యాక ఏకంగా రూ.22.50 లక్షలను పొందే వీలు ఉంటుంది. ఇందుకు గాను ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఆడపిల్ల వయస్సు 1 ఏడాది నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటే ఈ పాలసీలో మీరు చేరవచ్చు. ఇక ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ టర్మ్ 13 ఏళ్ల నుంచి 25 ఏళ్లు..
ఈ పాలసీ టర్మ్ సాధారణంగా 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. ఇందుకు గాను నెలవారీ లేదా 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి ఒకసారి చొప్పున ప్రీమియం చెల్లించవచ్చు. 25 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీరు 22 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. 25 ఏళ్లకు స్కీన్ మెచూరిటీ అవుతుంది. స్కీమ్ పూర్తి అయిన తరువాత పాలసీ మొత్తం, బోనస్, ఫైనల్ బోనస్ అన్నీ ఒకటే సారి వస్తాయి. ఈ పాలసీ పొందే ఆడపిల్ల తండ్రి వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
3వ ఏడాది నుంచి లోన్ సౌకర్యం..
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకున్న తరువాత 2 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మీరు ప్రీమియం చెల్లిస్తే.. 3వ ఏడాదిలో మీరు ఈ పాలసీపై లోన్ కూడా పొందవచ్చు. 2 ఏళ్ల అనంతరం అనుకోని కారణాల వల్ల ప్రీమియం కట్టలేకపోతే మీరు మీ పాలసీని సరెండర్ చేయవచ్చు. ఈ సౌకర్యం కూడా దీనికి అందుబాటులో ఉంది. అలాగే ప్రీమియం చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ కూడా అనుమతినిస్తారు. మీరు ఈ పాలసీ ప్రీమియం కట్టలేకపోతే 30 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆలోగా ప్రీమియం చెల్లించవచ్చు. అయితే ఇందుకు ఎలాంటి లేట్ ఫీజ్ వసూలు చేయరు.
పన్ను మినహాయింపు..
ఈ పాలసీ మీరు తీసుకుంటే దీనిపై మీరు పన్ను మినహాయింపు కూడా రెండు విధాలుగా పొందవచ్చు. ప్రీమియం మీరు కట్టాక ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే 10డి ప్రకారం మీరు మెచూరిటీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పాలసీలో భాగంగా మీరు కనీసం రూ.1 లక్ష నుంచి పొదుపు చేయవచ్చు. ఇందుకు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీ కుమార్తె పేరిట మీరు గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు.
రూ.22.5 లక్షలు ఇలా వస్తాయి..
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో భాగంగా మీరు 25 ఏళ్ల టర్మ్ ప్లాన్ పొందితే మీరు ఏడాదికి రూ.41,367 ప్రీమియం చెల్లించాలి. నెలవారీ ప్రీమియం అయితే రూ.3,447 అవుతుంది. ఇలా మీరు 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. దీనికి గాను రూ.22.5 లక్షల జీవిత బీమా కవరేజి లభిస్తుంది. దీనికి 25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తూ కుమార్తె తండ్రి లేదా సంరక్షకుడు చనిపోతే ఆ అమ్మాయి ప్రీమియం చెల్లించాల్సిన పని ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయికి ఏడాదికి రూ.1 లక్ష ఇస్తారు. అలా 25 ఏళ్ల టర్మ్ ప్లాన్ ముగిసే వరకు ఇస్తారు. చివర్లో మెచూరిటీ మొత్తాన్ని కూడా ఇస్తారు.
ఇక తండ్రి లేదా సంరక్షకుడికి రోడ్డు ప్రమాదం జరిగితే నామినీకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇస్తారు. దీంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇలా ఈ పాలసీ ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ప్రయోజనం పొందవచ్చు.