శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఆమదాలవలస మండలం దన్నానపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల నిరుద్యోగులు లేదా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆమదాలవలస దన్నపేట గ్రామ పరిధిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శ్రీకాకుళం జిల్లా వారు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో 750 ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో 5 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. కాగా హెటిరో కంపెనీలోనే 55 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏపీ లేదా తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుంది.
నవత ట్రాన్స్‌పోర్ట్‌లో 55 ఖాళీలు..
డిగ్రీ కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ మెకానికల్, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్ వంటి విద్యార్హతలను కలిగి ఉన్నవారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీలో 55 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖ పట్నం, రాజమండ్రిలో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ, టెన్త్ పాస్ లేదా ఫెయిల్, హెవీ లైసెన్స్ డ్రైవర్లు, ఐటీఐ డిప్లొమా ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పేటీఎం కంపెనీ 45 ఉద్యోగాలను కల్పించనుంది. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. టెన్త్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హత ఉన్నవారు, ఐటీఐ లేదా డిప్లొమా చదివిన వారు లేదా డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సెనర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్‌లో 25 ఖాళీలు ఉండగా వీరు దువ్వాడలో పనిచేయాల్సి ఉంటుంది. ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు. వయస్సు 19 నుంచి 35 ఏళ్ల మద్య ఉండాలి.
అమెజాన్‌లో 600 ఖాళీలు..
అమెజాన్ కంపెనీలో 600కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారు చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్, పికింగ్, షాపింగ్, లోడింగ్, అన్లోడింగ్ వంటి పనులు చేయాలి. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయో డేటా, ఆధార్ కార్డు, టెన్త్ లేదా ఇతర విద్యార్హతల సర్టిఫికెట్లు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు, జిరాక్స్ కాపీలు 2 సెట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని రావాల్సి ఉంటుంది.