Minimum Balance In Bank Account Rules : బ్యాంకులకు చెందిన కస్టమర్లు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ను ఉంచకపోతే అందుకు బ్యాంకులు పెనాల్టీని విధిస్తాయన్న సంగతి తెలిసిందే. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఇందుకు గాను భిన్న రకాల పెనాల్టీలను వసూలు చేస్తుంటాయి. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉంచని కస్టమర్ల నుంచి ఫీజును వసూలు చేయగా ఆ మొత్తం రూ.1855.43 కోట్లుగా ఉందని ఆర్బీఐ తెలియజేసింది. ఇదే విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2331 కోట్లుగా ఉంది. అంటే దీని శాతం 25.63 వరకు పెరిగిందని గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇలా మినిమం బ్యాలెన్స్ ఫీజులను వసూలు చేయడం ద్వారా సదరు 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇప్పటి వరకు మొత్తం రూ.5614 కోట్లను ఆదాయంగా పొందాయని ఆర్బీఐ తెలియజేసింది.
అయితే ఇలా మినిమం బ్యాలెన్స్ పెట్టని వారి నుంచి ఫీజు వసూలు చేయడం కరెక్టా కాదా.. అని అందరూ అడుగుతుంటారు. కానీ రూల్స్ ప్రకారం కరెక్టేనని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఈ మధ్యే ఎస్ బ్యాంక్‌పై ఈ విషయంలో ఆర్బీఐ రూ.91 లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంకు వారు కొందరు కస్టమర్ల నుంచి తప్పుగా మినిమం బ్యాలెన్స్ ఫీజును వసూలు చేశారని, అందుకనే ఆ జరిమానా విధించామని ఆర్బీఐ తెలిపింది. అయితే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఫీజుపై ఆర్బీఐ గతంలోనే పలు ఆదేశాలను బ్యాంకులకు జారీ చేసింది. అవేమిటంటే..
ఖాతాను నెగెటివ్‌గా చూపించకూడదు..
సాధారణంగా ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అయితే మినిమం బ్యాలెన్స్ పెట్టకపోతే రూ.400 నుంచి రూ.500 ను ఫీజుగా వసూలు చేస్తాయి. దీనికి జీఎస్టీ అదనం. అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో అయితే ఈ ఫీజు రూ.100 వరకు ఉంటుంది. దీనికి అదనంగా మళ్లీ జీఎస్టీ వసూలు చేస్తారు. అయితే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ పెట్టకపోతే అలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయంపై బ్యాంకులకు ఆర్బీఐ 2014 నవంబర్ 20న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే.. ఏ బ్యాంకు కూడా మినిమం బ్యాలెన్స్ ఉంచడం లేదని చెప్పి కస్టమర్ ఖాతాను నెగెటివ్ బ్యాలెన్స్ కింద మార్చకూడదు. అలా మారిస్తే ఆ బ్యాంకుపై ఆర్బీఐ జరిమానా విధిస్తుంది.
ఇక కస్టమర్ తన ఖాతాలో మినిమం బ్యాలెన్స్ పెట్టకపోతే ఎప్పటికప్పుడు బ్యాంకులు ఆ విషయాన్ని కస్టమర్‌కు తెలియజేయాలి. చాలా రోజుల వరకు ఇలాగే ఉంటే కస్టమర్ ఖాతాను జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద మార్చాలి. దానిపై నియంత్రణ పెట్టాలి. ఒకవేళ కస్టమర్ మళ్లీ ఖాతాలో డబ్బులు వేస్తే అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఫీజు వసూలు చేసి తిరిగి ఖాతాను సాధారణ ఖాతా కింద మార్చవచ్చు. దీంతో ఖాతాపై ఉండే నియంత్రణను ఎత్తేస్తారు. అప్పుడు ఖాతాను కస్టమర్ మళ్లీ యథావిధిగా వాడుకుంటాడు. ఇలా మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అకౌంట్ క్లోజ్ చేస్తే చార్జిలను వసూలు చేయకూడదు..
అయితే మీ బ్యాంకు ఖాతాలో గనక మినిమం బ్యాలెన్స్ పెట్టకపోతే అప్పుడు మీ బ్యాంకు వారు ఖాతా బ్యాలెన్స్‌ను నెగెటివ్‌గా చూపిస్తే అప్పుడు మీరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా చేస్తే బ్యాంకుపై ఆర్బీఐ జరిమానా విధిస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనూ కస్టమర్ ఖాతాను నెగెటివ్ బ్యాలెన్స్ కింద మార్చకూడదు. ఈ నిబంధనను ఆర్బీఐ కచ్చితంగా అమలు చేస్తోంది. అయితే చాలా రోజుల పాటు వాడని మీ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయాలని అనుకుంటే అప్పుడు కూడా దాన్ని ఉచితంగానే చేయాలి. బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జిలను వసూలు చేయరాదు. ఆర్బీఐ ఈ విషయంలోనూ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ రూల్స్‌ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.