Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు నగదును తరచూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డబ్బు పడితే అంత డబ్బును మీరు తీయవచ్చని అనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీకు ఇన్‌కమ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే నగదు పరిమితి ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ సమాచారాన్ని బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పిస్తాయి. దీంతో వారు మీకు నోటీసులను జారీ చేస్తారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కింద ఇచ్చిన పలు ముఖ్యమైన విషయాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక ఏడాదిలో మీరు బ్యాంకులో లేదా బ్యాంకు ఏటీఎం ద్వారా రూ.20 లక్షలకు మించి నగదును విత్‌డ్రా చేస్తే అప్పుడు మీరు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే గడిచిన 3 ఏళ్ల నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. అలా కాకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి అయితే ఈ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. వారు ఒక ఏడాదిలో రూ.1 కోటి వరకు ఒక బ్యాంకు అకౌంట్ నుంచి నగదును విత్ డ్రా చేయవచ్చు.
2 శాతం టీడీఎస్ చెల్లించాలి..
ఇక 3 ఏళ్లుగా ఐటీఆర్ ఫైల్ చేయకుండా ఒక ఏడాదిలో బ్యాంకు నుంచి రూ.20 లక్షలకు పైగా నగదును విత్‌డ్రా చేస్తే అలాంటి వారు 2 శాతం టీడీఎస్ చెల్లించాలి. అదే అలాంటి వారు బ్యాంకు నుంచి ఏడాదిలో రూ.1 కోటి వరకు నగదును విత్‌డ్రా చేస్తే అప్పుడు దానిపై 5 శాతం మేర టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 3 ఏళ్ల నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు రూ.1 కోటి వరకు ఏడాదిలో బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసినా వారు 2 శాతం మేర టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఐటీఆర్ దాఖలు చేసేవారు నగదు విత్‌డ్రా విషయంలో కాస్త ఉపశమనం పొందవచ్చు.
ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసే నగదు లావాదేవీలపై కూడా ఇది వరకే చార్జిలను పెంచారు. గతంలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.20 వసూలు చేసేవారు. కానీ జనవరి 1, 2022 నుంచి రూ.21 వసూలు చేస్తున్నారు. అయితే నెలలో ఏటీఎం ట్రాన్సాక్షన్ పరిమితి మించితేనే ఒక ట్రాన్సాక్షన్‌కు ఈ చార్జిని వసూలు చేస్తారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5 వరకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లను చేసుకోవచ్చు. అదే పట్టణాలు, నగరాల్లో అయితే 3 వరకు మాత్రమే ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ పరిమితి దాటితే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై చార్జిలను వసూలు చేస్తారు. అయితే మీరు ఎలాంటి ఐటీఆర్‌లను ఫైల్ చేయకుండా తరచూ భారీ ఎత్తున బ్యాంకుల నుంచి లేదా ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేస్తే అప్పుడు మీకు ఆదాయపు పన్ను శాఖ వారు కచ్చితంగా నోటీసులు పంపిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక మీరు తప్పనిసరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి సమస్య రాదు.