New Sim Card Rules : గతంలో మనం సిమ్ కార్డు తీసుకోవాలంటే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా జిరాక్స్ ఇచ్చి, అలాగే ఫొటోలను కూడా ఇచ్చి ఫామ్ నింపి తరువాత సిమ్ తీసుకునేవాళ్లం. దీంతో ఆ సిమ్ యాక్టివేట్ అయ్యేందుకు 24 నుంచి 48 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. సిమ్ తీసుకున్న వెంటనే 1 గంటలోనే యాక్టివేట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కొందరు మోసగాళ్లు ప్రజల పేరిట వారికి తెలియకుండానే సిమ్ కార్డులను తీసుకుంటున్నారు. దీంతో నేరాలను అరికట్టడం పోలీసులకు సైతం సవాల్‌గా మారుతోంది.
అయితే సిమ్ కార్డుల్లో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డులను తీసుకునే విషయంలో కొత్త రూల్‌ను అమలులోకి తెచ్చింది. అదేమిటంటే.. ఎవరైనా ఇకపై కొత్తగా సిమ్ కార్డును తీసుకుంటే వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది. దీంతో సిమ్ కార్డు ఇచ్చే టెలికాం కంపెనీ తప్పనిసరిగా కస్టమర్‌కు చెందిన చిరునామాను ఆధార్ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతుంది. తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్ చేసిన తరువాతనే కస్టమర్‌కు కంపెనీ సిమ్ కార్డు ఇవ్వాలి. లేదంటే సిమ్ ఇచ్చినా యాక్టివేట్ అవదు.
సిమ్ కార్డులపై కొత్త రూల్..
ఇలా కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డులపై కొత్త రూల్ పెట్టింది. దీని వల్ల మోసగాళ్లు సిమ్ కార్డులను ఎవరి పేరిట పడితే వారి పేరు మీద తీసుకోలేరు. దీంతో మోసాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇక విదేశాల నుంచి వచ్చే వారు ఇక్కడ సిమ్ తీసుకోవాలన్నా కూడా కేంద్రం రూల్స్‌లో సడలింపులు ఇచ్చింది.
గతంలో విదేశీయులు ఇక్కడ సిమ్ తీసుకోవాలంటే ఏదైనా లోకల్ ఫోన్ నంబర్‌ను ఇచ్చి దానికి వచ్చే ఓటీపీ ఆధారంగా సిమ్ ను తీసుకోవాల్సి వచ్చేది. కానీ అందరికీ లోకల్ నంబర్లు లభించవు కదా. అందుకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉండాలి. అలా లేకపోతే సిమ్ కార్డు పొందడం కష్టం అవుతుంది. అయితే ఈ ఇబ్బందిని తొలగించేందుకు గాను కేంద్రం కొత్తగా ఓ రూల్‌ను ప్రవేశపెట్టింది. అదేమిటంటే.. ఇకపై విదేశీయులు సిమ్ కార్డును పొందాలంటే అందుకు లోకల్ ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సిన పనిలేదు. వారి ఈ-మెయిల్ ఐడీ ఇవ్వవచ్చు. దీంతో మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు ఆ ఓటీపీ సహాయంతో కొత్త సిమ్ తీసుకోవచ్చు. ఇలా పలు సిమ్ కార్డు రూల్స్‌ను కేంద్రం మార్చింది.