తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో 1 స్టాఫ్ నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జోన్ల వారిగా చూస్తే జోన్ 1 లో 241, జోన్ 2 లో 86, జోన్ 3 లో 246, జోన్ 4 లో 353, జోన్ 5 లో 187, జోన్ 6 లో 747, జోన్ 7 లో 114 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులను నమోదు చేసేందుకు గాను అక్టోబర్ 14వ తేదీ వరకు గడువు విధించారు. పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. నవంబర్ 17వ తేదీన నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
వయో పరిమితి వివరాలు..
రాత పరీక్షకు 80 పాయింట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌కు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాలను రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు గరిష్ట వయో పరిమితిలో 10 ఏళ్లు సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్‌టీ, బీసీలకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి 3 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.36వేల నుంచి రూ.1 లక్ష వరకు ఇస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.700 చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.