ONDC Personal Loan Platform : పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బ్యాంకులకు వెళ్లి డాక్యుమెంట్లను సమర్పించడం, వెరిఫికేషన్.. ఇదంతా సమస్యగా మారిందా.. అయితే మీలాంటి వారి కోసమే Open Network for Digital Commerce (ONDC) ఓ అద్భుతమైన పరిష్కారాన్ని అంబాటులోకి తెచ్చింది. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు ఈ ప్లాట్ఫామ్లో కేవలం 6 నిమిషాల్లోనే పొందవచ్చని ఆ సంస్థ తెలియజేసింది. తాము అనేక బ్యాంకులతోపాటు ఫైనాన్స్ కంపెనీలతోనూ భాగస్వామ్యం అయ్యామని, కనుక వినియోగదారులు టీ తాగినంత తేలిగ్గా పర్సనల్ లోన్లను పొందవచ్చని ఆ కంపెనీ తెలిపింది.
వాస్తవానికి ONDC ప్లాట్‌ఫామ్‌ను డిసెంబర్ 31, 2021లోనే లాంచ్ చేశారు. కానీ పర్సనల్ లోన్ల విషయంలో మాత్రం తాజాగా పైన చెప్పిన విధంగా ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఈ ప్లాట్ఫామ్లో కస్టమర్లు కేవలం 6 నిమిషాల్లోనే తమకు నచ్చిన బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. మొత్తం పేపర్ లెస్ పద్ధతిలో ప్రాసెస్ కొనసాగుతుంది. డబ్బు ఇన్‌స్టంట్‌గా మీ అకౌంట్లో చేరిపోతుంది. ఈ సర్వీస్ ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని ONDC తెలియజేసింది.
లోన్ పొందడం ఇలా..
ONDC ప్లాట్ఫామ్లో లోన్ పొందాలనుకునే వారు ముందుగా ఆ ప్లాట్‌ఫామ్ సైట్ అయిన https://ondc.org/ondc-buyer-apps/ ను సందర్శించాల్సి ఉంటుంది. అందుకు కిందకు వెళ్తే లోన్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ అండ్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తరువాత కింద మళ్లీ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో క్రెడిట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసిన తరువాత కింద పర్సనల్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో పర్సనల్ లోన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అప్రూవ్ అయిన వెంటనే క్రెడిట్..
దీంతో కింద లోన్లు ఇచ్చే సంస్థల వివరాలను తెలియజేస్తారు. వాటిల్లో మీకు నచ్చిన బ్యాంకు లేదా సంస్థ నుంచి మీరు పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. ఆ సంస్థకు చెందిన ఆప్షన్‌పై క్లిక్ చేయగానే మీకు ఇంకో కొత్త పేజీ కనిపిస్తుంది. దాంట్లో మీరు మీ అన్ని వివరాలను నమోదు చేయాలి. దీంతో మీకు లోన్ వచ్చే చాన్స్ ఉంటే వెంటనే చెప్తారు. లోన్ వస్తే వెంటనే మీ అకౌంట్లోకి పంపిస్తారు. అయితే ఇందుకు ఆధార్, పాన్ అవసరం అవుతాయి. లోన్ అప్రూవ్ అయ్యాక నెల నెలా ఈఎంఐ చెల్లింపులకు గాను మీరు మీ బ్యాంకుకు ఎన్ఏసీహెచ్-ఈసీఎస్ డెబిట్ రిక్వెస్ట్ పంపించాలి. దీన్ని కూడా సదరు లోన్ కంపెనీయే ఆటోమేటిగ్గా నిర్వహిస్తుంది. దీంతో అన్నీ పూర్తయ్యాక మీకు అప్రూవ్ అయిన లోన్ మొత్తం మీ అకౌంట్లో పడిపోతుంది.
6 నిమిషాల్లోనే లోన్ తీసుకోవచ్చు..
ఈ విధంగా మీరు ONDC ప్లాట్ఫామ్లో పర్సనల్ లోన్‌ను చాలా వేగంగా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కేవలం కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే తమ ప్లాట్ఫామ్లో లోన్లు ఇచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నాయని, కానీ త్వరలోనే అన్ని ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నామని, కనుక కస్టమర్లకు మరిన్ని లోన్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే త్వరలో జీఎస్టీ ఇన్వాయిస్లపై బిజినెస్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తున్నామని, దీంతోపాటు తమ ప్లాట్ ఫామ్‌లో కస్టమర్లు ఇన్సూరెన్స్, మ్యుచువల్ ఫండ్స్ వంటి సేవలను పొందేలా కూడా మాధ్యమాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కనుక పర్సనల్ లోన్‌ను చాలా ఈజీగా పొందాలని అనుకునే వారు వెంటనే ఈ ప్లాట్‌ఫామ్‌ను సందర్శించి, వివరాలను నమోదు చేసి లోన్ పొందవచ్చు.