Petrol And Diesel Prices : రోజు రోజుకీ మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడుగా తమ ఆదాయం పెరగడం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అవైతే ధర ఎక్కువైనప్పటికీ ఇంధన వినియోగం పరంగా చూస్తే చాలా వరకు డబ్బును ఆదా చేస్తాయి. అందుకనే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే కేంద్రం త్వరలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనుందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. నవంబర్‌లో హర్యానా, మహారాష్ట్రతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ఎత్తుగడ వేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.6 నుంచి రూ.10 వరకు తగ్గించనున్నారని సమాచారం. దీంతో వాహనదారులకు పెద్ద ఊరట లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓట్ల కోసమేనా..?
అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోలియం సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు సరికదా భారీగా పెంచేశాయి. కేంద్రం కూడా ఆయా ధరలను కంపెనీలే స్వయంగా పెంచుకోవచ్చని అనుమతులను గతంలోనే ఇచ్చింది. దీంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ వచ్చాయి. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఇంధన ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తిరస్కరణ ఎదురు కాకూడదని చెప్పే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఏ కారణం ఉన్నప్పటికీ పైన చెప్పినట్లు భారీగానే వాటి ధరలు తగ్గితే సామాన్యులకు ఎంతగానో ఊరట లభించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.