RBI On Rs 10 Coins : సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోవడంతో ప్రజలు అందులో ఏది వచ్చినా కూడా నిజమే అని నమ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవలం అబద్ధాలనే నిజాలని విశ్వసిస్తున్నారు. దీంతో ఎంతో నష్టం జరుగుతోంది. గతంలో రూ.5 కరెన్సీ నోట్లపై కూడా లేని పోని పుకార్లను పుట్టించారు. దీంతో ఆ నోట్లను అప్పట్లో తీసుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేలపై కూడా ఇలాంటి పుకార్లనే పుట్టిస్తున్నారు. రూ.10 నాణేలు చెల్లడం లేదని అంటున్నారు. దీంతో వాటిని కలిగి ఉన్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
అయితే రూ.10 నాణేలపై ఆర్బీఐ గతంలోనూ ఎన్నో సార్లు ప్రకటనలు ఇచ్చింది. రూ.10 నాణేలు చెల్లుతాయని, వాటిని తాము నిషేధించలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ నాణేలను చాలా మంది ఇప్పటికీ తీసుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని బ్యాంకుల్లో సైతం ఈ నాణేలను తీసుకోవడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ పుకారును వాస్తవంగా ఎప్పుడు ఎవరు పుట్టించారో తెలియలేదు కానీ రూ.10 నాణేలను మాత్రం ఇంకా చాలా మంది విశ్వసించడం లేదు. అయితే దీనిపై ఆర్బీఐ మళ్లీ స్పష్టమైన ప్రకటనను జారీ చేసింది.
టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు..
రూ.10 నాణేలు చెల్లుతాయని, ఎట్టి పరిస్థితిలోనూ వాటిని తీసుకోవాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఎవరైనా రూ.10 నాణేలను తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఈ నాణేలను తీసుకోకపోతే ఆర్బీఐ టోల్ ఫ్రీ నంబర్ 14440 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులకు సైతం ఈ రూల్ వర్తిస్తుందని ఆర్బీఐ తెలియజేసింది.
అయితే రూ.10 నాణేలు ఉన్నవారు తమకు సమీపంలో ఉన్న ఎస్బీఐ లేదా ఇతర ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బ్యాంకులకు వెళ్లి ఆ నాణేలను మార్పిడి చేసుకోవచ్చు. దీంతో ఇబ్బంది పడాల్సిన అవపరం ఉండదు. అయితే అక్కడ కూడా ఈ నాణేలను తీసుకోకపోతే అప్పుడు పైన చెప్పిన ఆర్బీఐ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీంతో ఆర్బీఐ వారు సదరు బ్యాంకులపై చర్యలు తీసుకుంటారు. ఇలా ఈ నాణేలు ఉన్నవారు వాటిని సులభంగా మార్పిడి చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదని ఆర్బీఐ తెలియజేసింది.