RITES Recruitment 2024 : రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. RITESలో గ్రూప్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.rites.com అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ.70వేల నుంచి రూ.2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 10, 2024 నుంచి ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 6, 2024 ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం లేదా పీజీడీఎం, పీజీడీహెచ్ఆర్ఎం కోర్సుల్లో ఏదైనా ఒక కోర్సు చదివి ఉండాలి. అభ్యర్థులు గ్రూప్ జనరల్ మేనేజర్ పోస్టులకు అప్లై చేస్తే కనీసం అనుభవం 23 ఏళ్లు ఉండాలి. అదే డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే అనుభవం 11 ఏళ్లు ఉండాలి. పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు గ్రూప్ జనరల్ మేనేజర్ అయితే 53 ఏళ్లకు మించకూడదు. అదే డిప్యూటీ మేనేజర్ పోస్టుకు అయితే వయస్సు 41 ఏళ్లు మించరాదు. జనరల్ విభాగానికి చెందిన అభ్యర్థులు రూ.600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యర్థులు అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.