ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC0 వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెస్ట్రన్ రైల్వే డివిజన్ పరిధిలోని వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 5066 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటికి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటకే ప్రారంభం కాగా అక్టోబర్ 22ను చివరి తేదీగా నిర్ణయించారు. 10వ తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధంచిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. పదో తరగతి, ఐటీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్తులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.rrc-wr.com/ అనే అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
బీసీటీ డివిజన్, బీఆర్‌సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్‌టీఎం డివిజన్, ఆర్‌జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్ వర్క్‌షాప్, ఎంఎక్స్ వర్క్‌షాప్, బీవీపీ వర్క్‌షాప్, డీహెచ్‌డీ వర్క్‌షాప్, పీఆర్‌టీఎన్ వర్క్‌షాప్, ఎస్‌బీఐ ఇంజినీరింగ్ వర్క్‌షాప్, ఎస్‌బీఐ సిగ్నల్ వర్క్‌షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్ డివిజన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏఏ, ఎలక్ట్రిషియన్ తదితర ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 22 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా, రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.