SBI Asha Scholarship 2024 : దేశవ్యాప్తంగా ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గొప్ప సదవకాశాన్ని కల్పిస్తోంది. 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఎస్బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు వారి చదువు, కుటుంబ ఆదాయం, ఇతర అంశాల ఆధారంగా కనీసం రూ.15వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు నగదును అందించనుంది. ఈ మేరకు ఎస్బీఐ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 10వేల మందికి ఈ విధంగా స్కాలర్షిప్ అందించేందుకు ఎస్బీఐ ఈ కార్యక్రమానికి పూనుకుంది. ఇక ఇందులో భాగంగా స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను విద్యార్థులు sbifashascholarship.org అనే వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు గాను మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
ఎంత ఇస్తారు..?
ఇక విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎస్బీఐ స్కాలర్ షిప్‌ను ఈ ప్రోగ్రామ్ ద్వారా అందించనుంది. 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేయవచ్చు. 12వ తరగతి వరకు అయితే విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులను సాధించి ఉండాలి. కుటుంబ ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. వీరికి ఎస్బీఐ రూ.15వేలు ఇస్తుంది. అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా 75 శాతం మార్కులను సాధించాలి. వీరి కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. వీరికి రూ.50వేల వరకు స్కాలర్ షిప్ ఇస్తారు.
పీజీ చదువుతున్న వారికి రూ.70వేల వరకు స్కాలర్షిప్ ఇస్తారు. అయితే విదేశాల్లో చదవాలనుకునే వారికి రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ ఇస్తారు. కానీ వారు 75 శాతం మెరిట్ సాధించి ఉండాలి. ఇక విద్యార్థులను ముందుగా టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారిలో మెరిట్ ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 10వేల మందిలో 5వేల మంది విద్యార్థినులకు అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ స్కాలర్ షిప్ పొందేందుకు స్టూడెంట్లు పలు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాలు ఇవే..
విద్యార్థులు అకాడమిక్ ఇయర్ మార్క్ షీట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు), విద్యార్థులు చదువుతున్న కాలేజీ లేదా స్కూల్లో ఈ ఏడాది చెల్లించిన ఫీజు రశీదు, అడ్మిషన్ పత్రాలు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఒక ఫోటో, కుల ధ్రువీకరణ పత్రం (అవసరం ఉన్నవారికి) సమర్పించాల్సి ఉంటుంది. వీటి ద్వారా విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు. పైన ఇచ్చిన సైట్లో ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎస్బీఐ ఈ ఏడాది మొత్తం 10వేల మందికి ఆశా ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్ను అందించనుంది. కనుక ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.