TCS BPS Recruitment 2024 : మీరు సైన్స్ లేదా కామర్స్ లేదా ఏ ఇతర స్ట్రీమ్‌లో అయినా సరే డిగ్రీ చదివారా..? అయితే మీకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే డిగ్రీ చదివిన వారికి దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సాఫ్ట్వేర్ జాబ్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. TCSలో ఖాళీగా ఉన్న BPS ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా కాలేజీ నుంచి బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ చదివి ఉండాలి. 2025 నాటికి ఉత్తీర్ణులయ్యే వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి కేవలం ఒక బ్యాక్ లాగ్ మాత్రమే ఉన్నా కూడా అలాంటి అభ్యర్థులు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో సాధించిన మార్కులతోపాటు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి..
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కలిగి ఉండాలి. అనలిటికల్ అండ్ లాజికల్ రీజినింగ్ స్కిల్స్, ఏ షిఫ్ట్‌లో అయినా పనిచేసే సామర్థ్యం, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, గణితం, లాజికల్ రీజనింగ్ ఎబిలిటీపై అవగాహన, కంప్యూటర్ కీబోర్డు స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ వంటివి వచ్చి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 11, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. అయితే మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను టీసీఎస్ వెల్లడించలేదు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి సుమారుగా 10వేల నుంచి 15వేల మందికి కొత్తగా ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు మాత్రం ఈ మధ్యే ఆ కంపెనీ తెలియజేసింది. కనుక భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. అందుకు గాను అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలి.
80 మార్కులకు రాత పరీక్ష..
రాత పరీక్షకు 65 నిమిషాల సమయం ఇస్తారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు ఉంటాయి. 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. వెర్బల్ ఎబిలిటీ నుంచి 24 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 26 నిమిషాల సమయం ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 25 నిమిషాల సమయం ఇస్తారు. ఈ సమయంలోగా పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://www.tcs.com/careers/india/tcs-bps-hiring-2025 అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దీంతో అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.