తెలంగాణ రాష్ట్రంలో 11వేల అంగన్ వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వివరాలను వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో 15వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11వేల వరకు అంగన్ వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితోపాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఆ ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
కనీసం ఇంటర్ చదివి ఉండాలి..
కేంద్ర ప్రభుత్వం విధించిన నూతన నిబంధనల ప్రకారం చూస్తే.. అంగన్‌వాడీ టీచర్లతోపాటు హెల్పర్లుగా ఎంపికయ్యే వారు కనీసం ఇంటర్ చదివి ఉండాలి. గతంలో అంగన్‌వాడీ పోస్టులకు కనీసం టెన్త్ చదివిన వాళ్లను తీసుకునేవారు. అయితే ఈ నిబంధను మార్చారు. ఇక ఈ సారి వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 65 ఏళ్లు దాటిన వారి సేవలను వినియోగించుకోకూడదు. ఏర్పడిన ఖాళీల్లో 50 హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలి.
త్వరలో నోటిఫికేషన్..
సూపర్ వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. దీనికి టీచర్లు కనీసం 5 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. అయితే ప్రస్తుతం కొందరు హెల్పర్లుగా పనిచేస్తున్న వారికి కనీస విద్యార్హతలు లేవు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మేరకు వారికి పదోన్నతులను కల్పించనున్నారు. ఇక త్వరలోనే అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో త్వరలోనే విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య, అర్హతలు వంటి అంశాలపై స్పష్టత రానుంది. కనుక తెలంగాణ యువత ఇప్పటి నుంచే సిద్ధం కావల్సి ఉంటుంది.