Telangana Mee Seva : తెలంగాణ మీ-సేవ‌ల్లో కొత్త‌గా మ‌రిన్ని సేవ‌లు.. వివ‌రాలు ఇవే..!

Telangana Mee Seva : తెలంగాణ‌లో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో ప్ర‌జ‌ల‌కు ప‌లు ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మీ-సేవ కేంద్రాల్లో మ‌రో 9 కొత్త ర‌కాల సేవ‌లు ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానున్నాయి. మండ‌ల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాల‌యాల్లో కాకుండా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌లు ర‌కాల ప‌త్రాల‌ను మీ-సేవ కేంద్రాల నుంచి ఇక‌పై తీసుకోవ‌చ్చు. దీనికి గాను ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ఎమ్మార్వో కార్యాల‌యాల్లో జారీ చేస్తున్న ప‌త్రాల‌ను ప్ర‌జ‌లు ఇక‌పై నేరుగా మీ-సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లోనే పొంద‌వ‌చ్చు. ఆ విధంగా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఇక కొత్త‌గా అందుబాటులోకి తీసుకురానున్న 9 ర‌కాల ప‌త్రాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను మీ-సేవ ఆన్‌బోర్డులో ఉంచేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి జిల్లా క‌లెక్ట‌ర్లు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.

Telangana Mee Seva 9 new type of government services available soon
Telangana Mee Seva

మీ-సేవ‌ల్లో ల‌భించే కొత్త సేవ‌లు..

పేరు మార్చుకోవ‌డం, లోక‌ల్ క్యాండిడేట్‌, విద్యార్థుల‌కు అవ‌స‌రం అయిన స్ట‌డీ క్యాప్ స‌ర్టిఫికెట్, క్రిమిలేయ‌ర్‌, నాన్ క్రిమిలేయ‌ర్‌, మైనారిటీ ధ్రువ‌ప‌త్రాలు, ఆర్‌వోఆర్‌వ‌న్‌బీ స‌ర్టిఫైడ్ కాపీల‌ను ఇక‌పై మీ-సేవ కేంద్రాల ద్వారా ప్ర‌జ‌లు పొంద‌వ‌చ్చు. కాగా త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌స్త్రాల యాజ‌మాన్య హ‌క్కుల చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. ఈ చ‌ట్టానికి సంబంధించి ఇప్ప‌టికే క్షేత్ర స్థాయిలో కీల‌క సూచ‌న‌లు అందాయి. త‌హ‌సీల్దార్ స్థాయిలోనే అధికారులు ఉండాల‌ని ఎక్కువ మంది ప్ర‌జ‌ల నుంచి అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చిన‌ట్లు సమాచారం.

కాగా జూలై 2 నుంచి 23వ తేదీ వ‌ర‌కు ఆర్‌వోఆర్ 2024 చ‌ట్టానికి సంబంధించిన ముసాయిదాను ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌ధాన కమిష‌న‌ర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి వివిధ వ‌ర్గాల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించారు. అభ్య‌ర్థ‌న‌లు అన్నింటినీ ప‌రిశీలించి కొత్త చ‌ట్టంలో చేర్చాల్సిన ముసాయిదాను రూపొందించాల‌ని క‌మిష‌నర్ న‌వీన్ మిట్ట‌ల్ సంబంధిత అధికారుల‌కు సూచించార‌ని సమాచారం. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే పూర్తి కానుంద‌ని తెలుస్తోంది.