TS Gurukulam PET Results 2024 : తెలంగాణ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు.. త్వ‌ర‌లోనే ఫ‌లితాల విడుద‌ల‌..

TS Gurukulam PET Results 2024 : తెలంగాణలోని నిరుద్యోగులు, యువ‌త‌కు రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే మ‌రో శుభ‌వార్త‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గురుకుల పీఈటీ ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 616 పోస్టుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ ఫ‌లితాల కోసం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాగా ఎట్ట‌కేల‌కు ఈ ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ విడుద‌ల చేయ‌బోతోంది.

సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భ‌ర్తీకి 2017లో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజ‌న గురుకుల సొసైటీలో 83, సాధార‌ణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు గాను రాత ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేశారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల న్యాయ వివాదాలు మొద‌ల‌య్యాయి. కానీ వాటిని క‌మిష‌న్ ప‌రిష్క‌రించింది. 1:2 నిష్ప‌త్తిలో మెరిట్ జాబితాను విడుద‌ల చేశారు.

TS Gurukulam PET Results 2024 know the full details
TS Gurukulam PET Results 2024

సొసైటీల వారిగా ఆప్ష‌న్లు..

ధ్రువ‌ప‌త్రాల వెరిఫికేష‌న్‌కు ముందే అభ్య‌ర్థుల నుంచి సొసైటీల వారిగా ఆప్ష‌న్ల‌ను తీసుకున్నారు. ఈ ఆప్ష‌న్ల ప్ర‌కార‌మే తుది ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఇక ఇత‌ర ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన నియామ‌క ప్ర‌క్రియ కూడా తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. చాలా కాలంగా న్యాయ వివాదాల‌తో పెండింగ్‌లో ఉన్న నోటిఫికేష‌న్ల ఫ‌లితాల‌ను కూడా త్వ‌ర‌లో వెల్ల‌డించడానికి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. గురుకుల సొసైటీల నియామ‌కాల్లో జ‌రిగిన పొర‌పాట్లు ఇత‌ర నోటిఫికేష‌న్ల‌లో త‌లెత్త‌కుండా ఉండేందుకు గాను అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నోటిఫికేష‌న్ల‌ను ఇచ్చేందుకు ముందే న్యాయ స‌ల‌హాల‌ను తీసుకుంటుండ‌డం విశేషం. దీంతో పొర‌పాట్లకు తావు లేకుండా ఉంటుంది.

పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు..

కాగా గురుకుల సొసైటీ నియామ‌కాల్లో జ‌రిగిన పొర‌పాట్లు టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ల‌లో త‌లెత్త‌కుండా అధికారులు ఇప్ప‌టి నుంచే అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటున్నారు. ముందుగా ప్ర‌భుత్వ విభాగాల్లోని 1540 ఏఈఈ పోస్టుల నియామ‌కం పూర్తి చేశారు. త‌రువాత 247 పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ జ‌న‌ర‌ల్ ర్యాంకు జాబితాను వెల్ల‌డించారు. అక్టోబ‌ర్‌లో ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఉంటుంది. ఈ నియామ‌కాలు పూర్త‌యిన త‌రువాతే 833 ఏఈ పోస్టుల‌కు ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తారు. దీంతో బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక ఈ అంశాల‌న్నింటిపై కూడా త్వ‌ర‌లోనే అధికారికంగా స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు.